పేదల భూములపై కన్ను

పేదల భూములపై కన్ను - Sakshi


రూ. కోట్ల విలువైన భూములపై పెద్దల కన్నుపడింది. అధికారులను ప్రసన్నం చేసుకొని విలువైన భూములను చేజిక్కుంచుకునేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో 11 ఏళ్లుగా సాగులో ఉన్న రైతులను కాదని బోగస్ పేర్లతో సృష్టించి ప్రభుత్వం నుంచి పరిహారం పొందేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- అధికారులను ప్రసన్నం  చేసుకుంటున్న అక్రమార్కులు

- ఆందోళన చెందుతున్న రైతులు

- ఉద్యమించినా స్పందించలేదని ఆవేదన

- పట్టించుకోకుంటే ఉధృతం చేస్తామని హెచ్చరిక

మునగపాక:
మండలంలోని టి.సిరసపల్లి  రెవెన్యూలోసర్వే నంబర్లు 138, 139లో సుమారు 800 ఎకరాల మేర ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయి. 1994లో ఇదే గ్రామానికి చె ందిన 58 మంది పేద రైతులకు డీఆర్‌డీఏ 65 ఎకరాలు సాగు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో జీడిమామిడి, సీతాఫలం, సుబాబుల్, యూకలిప్టస్ తదితర పంటలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తెలియకుండా 2011లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వే లోపభూయిష్టంగా ఉందంటూ అప్పటిలో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం సంబంధిత ప్రాంతంలో పరిశ్రమల పార్కు నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది.



అంతేకాకుండా ఏపీఐఐసీ సంబంధిత స్థలాన్ని కేటాయించినట్లు ప్రకటించింది. సాగులో ఉన్న రైతులకు పరిహారం అందిస్తామని అప్పటిలో అధికారులు పేర్కొన్నారు దీంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. ఇంకేముంది రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకొని అండగల్‌లో బోగస్ పేర్లు చేర్పించారని ప్రచారం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగులో ఉన్న తమను కాదని బోగస్ పేర్లను సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాజేయాలని చూస్తున్నారంటూ సంబంధిత రైతులు 31 రోజులుగా స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు.

 

బంజరుపై నేతల కన్ను..

సిరసపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ బంజరుపై కొంతమంది నేతలు కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది. సుమారు 800 ఎకరాల్లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు నాయకులు పావులు కదుపుతున్న సమాచారం.  ప్రస్తుతం ఎకరా రూ. 5 లక్షలు ఉన్నందున ఈ భూములను కాజేసి రూ.కోట్లలో ప్రభుత్వం నుంచి పరిహారం కాజేయాలన్న ఆలోచనతో పావులు కదుపున్నారని ప్రచారం జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top