అటు పోలీస్.. ఇటు మావో!

అటు పోలీస్..   ఇటు మావో! - Sakshi


మన్యంలో పట్టుకోసం ఎవరి ప్రయత్నాలు వారివి

ఒడిదుడుకుల్లో మావోయిస్టు పార్టీ

గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు బలహీనం

పునర్నిర్మాణంపై దృష్టి సారించిన కేంద్ర కమిటీ

పరిస్థితులపై కొత్త ఎస్పీ అధ్యయనం, రహస్య పర్యటన


 


విశాఖపట్నం/కొయ్యూరు :  మన్యంపై పట్టుకోసం ఇటు పోలీసులు.. అటు మావోయిస్టులు ఎవరికి వారు వదలకుండా పోరాడుతున్నారు. ఈ పోరులో కొన్ని నెలలుగా పోలీసులే పైచేయి సాధిస్తున్నారు. వరుస దెబ్బలతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. ముఖ్యంగా ఈస్టు డివిజన్‌కు నాయకత్వం లేకుండా పోయింది. గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఎలాగైనా పార్టీని తిరిగి బలోపేతం చేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు తెలిసింది. కొన్నేళ్ల కిందట  గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా  పనిచేసిన జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణను లేదా బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్‌ను  ఈ ప్రాంతానికి  పంపించే అవకాశాలున్నట్లు సమాచారం.


 

ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో  నాలుగు డివిజన్లున్నాయి. దీనిలో ఒకప్పుడు ఈస్టు డివిజన్ కీలక పాత్ర  పోషించింది.  ఈస్టు డివిజన్‌లో ప్రస్తుతం గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలున్నాయి. ఈ రెండు కూడా ఇప్పుడు నాయకత్వ లోపంతో  ఉన్నాయి. చలపతి  కార్యదర్శిగా  ఉన్న ఈస్ట్ డివిజన్ వరుసగా జరుగుతున్న సంఘటనలతో  బలహీన పడింది.  సుమారు రెండేళ్ల కిందట బలపం సమీపంలో జరిగిన సంఘటనలో కోరుకొండ ఏరియా కమిటీ కమాండర్ శరత్ గిరిజనుల చేతిలో హతమయ్యారు. అదే సమయంలో  ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్లో  కోరుకొండ కార్యదర్శి మరణించారు.


 

తాజాగా ఈస్టు డివిజన్‌కు సెంట్రల్ రీజియన్ కమాండ్(సీఆర్‌సీ) ప్లాటూన్ వింగ్ నేతగా పనిచేసిన కుడుముల వెంకట్రావు అలియాస్ రవి మరణం డివిజన్‌ను ఆందోళనలో పడేసింది. దానికి కొనసాగింపుగా ఈ నెల4న మర్రిపాకల ఎన్‌కౌంటర్లో గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ ఆజాద్‌తో పాటు ఆనంద్ మరణం కొలుకోలేని దెబ్బకొట్టింది. అతని మరణంతో గాలికొండ ఏరియా కమిటీకి నాయకత్వం లేకుండా పోయింది.


 

పాత వారికే కొత్త బాధ్యతలు?

వరుస దెబ్బల తర్వాత మావోయిస్టు పార్టీ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించడంతో పాటు ఈ ప్రాంతంపై పట్టున్న వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. దానిలో భాగంగా కృష్ణకు ఈస్టు డివిజన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన గాలికొండ ఏరియా కమిటీలో పనిచేశారు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మొదట మల్కన్‌గిరి వెళ్లి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు.


 

పరిస్థితులపై కొత్త ఎస్పీ అధ్యయనం, రహస్య పర్యటన

మావోయిస్టు కేంద్ర కమిటీ వ్యూహాలు, మన్యంలో తాజా పరిణామాలపై విశాఖ కొత్త ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అధ్యయనం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఏజెన్సీలో ఆయన రహస్యంగా పర్యటిస్తున్నారు. రాళ్లగడ్డ వద్ద నిర్మిస్తున్న పోలీస్ అవుట్‌పోస్టు పనులను ఆయన పరిశీలించారు. చింతపల్లి, జి.మాడుగుల, అన్నవరం, పెదబయలు పోలీస్ స్టేషన్లు, ప్రాంతాల్లో తిరిగిన ఎస్పీ మన్యంపై ఓ అవగాహనకు వచ్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రత్యేక దృష్టి సారించిన సమయంలో కొత్త ఎస్పీ హుటాహుటిన మన్యంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకమీదట కూడా మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరిచేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top