వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం - Sakshi


భీమవరం : గోదావరి వరదకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆదివారం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించి వచ్చిన అనంతరం వారు భీమవరంలో ఎంపీ తోట సీతారామలక్ష్మి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వరదల కారణంగా పంట పొలాలు మునిగి దెబ్బతిన్నాయని వాటిని చూసి చలించిపోయానని చెప్పారు. బాధితులందరికీ ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. వరద బాధితులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసినట్టు చెప్పారు.

 

 సమావేశంలో  మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గోదావరి తీర ప్రాంతంలో వరద నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పోలవరం నియోజకవర్గంలో పొగాకు, అరటి తోటలు, ఆచంట, పాలకొల్లు ప్రాంతాల్లో అరటి, తమలపాకు, కొబ్బరి, వరి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. వీటి నష్టాన్ని అంచనా వేసి నివేదించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. త్వరలో అధికారులు బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయన్నారు. సమావేశంలో విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, గన్ని వీరాంజనేయులు, మెంటే పార్ధసారథి, భీమవరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top