ఐదేళ్లలో కొత్త రాజధాని

ఐదేళ్లలో కొత్త రాజధాని


ల్యాండ్ పూలింగ్ విధానమే..

రైతులు ఒప్పుకోకపోతే భూసేకరణ

కలెక్టర్లు, ఎమ్మెల్యేలదే బాధ్యత

పదేళ్ల వరకూ ఎకరాకు రూ.25వేలు

సీఎం సమక్షంలో రాజధాని సలహా కమిటీ నిర్ణయాలు

 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం ఐదేళ్లలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని కమిటీ సభ్యులకు సూచించారు. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాల భూములను సమీకరించాలని పేర్కొన్నారు. రాజధాని సలహా కమిటీ సభ్యులు శనివారం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తొలుత ఉదయం 10 గంటలకు రాజధాని సలహా కమిటీ మంత్రి నారాయణ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. రాజధాని సలహా కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్నే అనుసరించాలని, రైతుల నుంచి సేకరించిన భూమిలో 50 శాతం భూమి ఉమ్మడి ఆస్తిగా పరిగణించాలని కమిటీ సభ్యులకు సీఎం సూచించారు.



ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వేగవంతం చేయడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులు తమ భూమిని రాజధానికి బదలాయించిన వెంటనే ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. లే ఔట్ ప్లాన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే సర్టిఫికెట్ల జారీ అమలవుతుందన్నారు. రైతుల వాటాకింద వచ్చే భూమిని అమ్ముకునే హక్కు కల్పించాలని నిర్ణయించారు. భూమిని అమ్ముకునే రైతులకు స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇవ్వనున్నట్టు కమిటీ నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసమీకరణకు రైతులను ఒప్పించే బాధ్యత కలెక్టర్లు, ఎమ్మెల్యేలదేనని నిర్ణయించారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి రైతులు ఒప్పుకోకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ (భూసేకరణ) ద్వారా భూమిని తీసుకుంటుందని కమిటీ స్పష్టం చేసింది.  



 ఎకరాకు రూ.25వేల పరిహారం



రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.25వేల చొప్పున అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీనికి ఏటా 5 శాతం అదనంగా ఉంటుందని నిర్ణయించింది. మొదటి లావాదేవి జరిగిన రోజు నుంచి పదేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం ఉంటుందని తీర్మానించారు. భూములు కోల్పోకపోయినా వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి, వారిలో నైపుణ్యం పెంచి, ఉద్యోగావకాశాలు కల్పించాలని కమిటీకి సీఎం సూచించారు.



సీఆర్‌డీఏ ఏర్పాటు కాగానే వీజీటీఎం రద్దు



 రాజధాని అభివృద్ధి మండలి (కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఏర్పాటు కాగానే వీజీటీఎం (విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి) రద్దు చేయాలని నిర్ణయించారు. సీఆర్‌డీఏను ఏర్పాటు చేయాలని,  నోటిఫికేషన్ ద్వారా వీజీటీఎం రద్దు చేయాలని సూచించారు.



30న విధివిధానాల ప్రకటన



ల్యాండ్ పూలింగ్ విధానంపై ఈనెల 30న విధివిధానాలు ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది. ఈనెల 29న మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతుంది.  30వ తేదీన సీఎంతో సమావేశమై భూసమీకరణపై మార్గదర్శకాలను ప్రకటించాలని కమిటీ భావిస్తోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top