ఐదు వేల మందికి రుణమాఫీ హుళక్కి


ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ పథకానికి విధించిన అడ్డగోలు నిబంధనల ఫలితంగా జిల్లాలోని ఐదు వేల మంది సహకార రైతులకు రుణమాఫీ హుళక్కయింది. ఈ రైతులకు 2008లో అమలైన రుణమాఫీ వర్తించకపోగా ప్రస్తుతం 2014లో ప్రకటించిన మాఫీ కూడా దరిచేరటం లేదు.  తేదీలను సవరించాలని ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు అనేక మంది చేసిన విజ్ఞప్తులు అరణ్యరోదనలయ్యాయి.  

 

25 సొసైటీల్లో గందరగోళం

జిల్లాలోని 25 సొసైటీల్లో సుమారు 5 వేల మంది రైతులు రుణమాఫీకి నోచుకోవడం లేదు. పామూరు సొసైటీలో అత్యధికంగా 936 మందికీ ఈ ఫలాలు అందటం లేదు. అద్దంకి సొసైటీలో 24 మంది, బి.నిడమానూరు 44, బేస్తవారిపేట 320, చీరాల 75, చీమకుర్తి 16, దర్శి 298, గిద్దలూరు 215, ఇంకొల్లు 311, కనిగిరి 290, కందుకూరు 176, కొండపి 150, కురిచేడు 292, కారంచేడు 156, మార్టూరు 164, మార్కాపురం 264, పర్చూరు 130, పొదిలి 70, రావినూతల 59, సింగరాయకొండ 135, సంతమాగులూరు 112, ఒంగోలు పట్టణ పీడీసీసీ బ్యాంకు పరిధిలో 103, ఉప్పుగుండూరులో 286, యర్రగొండపాలెం 322, టంగుటూరులో ఇద్దరు రైతులు  అనర్హులుగా తేల్చారు.



రుణాలు బట్వాడా అయిన తేదీలను మినహాయించి 31/03/2014 నాటికి నిల్వ ఉన్న రుణాలు మాఫీ చేస్తే ఈ రైతులకు కూడా అర్హత లభిస్తోంది. అలా కాకుండా 01/04/2007 తర్వాత బట్వాడా చేసిన రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుండటంతో సుమారు రూ.2 కోట్లు రుణమాఫీని నష్టపోతున్నారు. సొసైటీల్లో రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తించే తేదీలను సవరించి రైతులందరికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్‌బాబు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు.

 

స్కేలు ఆఫ్ ఫైనాన్స్ తిరకాసు

రైతుల రుణమాఫీలో స్కేలు ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) తిరకాసుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రుణాలు బట్వాడా చేసిన నాటికి అమలులో ఉన్న స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా గతంలోది పరిగణనలోకి తీసుకోవడంతో కొందరు రైతులకు నామమాత్రంగానే లబ్ధిపొందారు. రేణుక అనే మహిళా రైతు తనకున్న 1.44 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రూ.35 వేలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో రుణం తీసుకున్నారు.



రుణం మంజూరు చేసే నాటికి వరి సాగుకు రూ.25 వేలు రుణపరిమితిగా నిర్ణయించారు. ఆ ప్రకారం ఆ రైతుకు రూ.35 వేలు రుణం మంజూరు చేశారు. అయితే రుణమాఫీలో శ్రీవరి సాగు చేసినట్లుగా పరిగణనలోకి తీసుకొని ఎకరాకు కేవలం రూ.12 వేలు చొప్పున రూ.17,676 మాత్రమే రుణాన్ని మాఫీ చేస్తున్నట్లుప్రకటించింది. 2013 రుణ పరిమితి ప్రకారం శ్రీవరి సాగుకు కూడా ఎకరాకు రూ.16 వేలు రుణ పరిమితిగా నిర్ణయించారు. ఈ పరిమితిని పరిగణనలోకి తీసుకున్నా ఆ రైతుకు రూ.24 వేలు మాఫీ కావాల్సి ఉంది.



పత్తి సాగు చేసిన రైతుల విషయంలో కూడా తీరని అన్యాయం చేశారు. 2013-14 సంవత్సరానికి సంబంధించిన పత్తి సాగుకు రూ.35 వేలు రుణ పరిమితిగా నిర్ణయించారు. తరువాత ఎకరాకు రూ.22 వేలు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో లబోదిబోమంటున్నారు. కొంత మంది రైతులు 2013లో రుణం తీసుకున్నారు.పొరపాటుగా 2005లో రుణం పొందినట్లు నమోదు చేయడంతో ఆ రైతులు కూడా నష్టపోయారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2013లో జిల్లాలో నిర్ణయించిన రుణపరిమితి ప్రకారం రుణమాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top