పర్యాటకాభివృద్ధికి పంచసూత్రాలు

పర్యాటకాభివృద్ధికి పంచసూత్రాలు


కార్తీకమాస సంరంభానికి బెజవాడలోని   భవానీద్వీపం ముస్తాబైంది. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ద్వీపం కృష్ణానదీపాయలో.. పచ్చటి పచ్చిక బయళ్లలో.. చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన స్థలం. అందుకే.. ఏటా వందల సంఖ్యలో వనసమారాధకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే, ఇక్కడ అడుగు పెట్టేపర్యాటకులకు మాత్రం అడుగడుగునా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భవానీద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన పంచసూత్రాలివీ..

- సాక్షి, విజయవాడ

 

1-  ప్యాకేజీల్లో మార్పు అవసరం

 

ఈ కార్తీకమాసంలో వందల సంఖ్యలో భవానీద్వీపానికి రానున్నారు. లక్షల్లో ఆదాయం రానుంది. అయితే, ఏపీటీడీసీ అధికారులు ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ప్యాకేజీల గురించి ప్రచారం చేసే ప్రయత్నం చేయలదు. యూత్రికుల కోసం ఏపీటీడీసీ రెండు ప్యాకేజీలు సిద్ధం చేసింది. ఒక్కొక్కరికీ రూ.200 చెల్లిస్తే భవానీద్వీపానికి బోటింగ్‌తో పాటు ద్వీపంలో తాలి (భోజనం) ఏర్పాటు చేస్తారు. రూ.280 చెల్లిస్తే బోటింగ్, తాలితో పాటు ఐస్‌క్రీమ్, స్వీట్, సలాడ్ ఇస్తారు. రూ.50 చెల్లిస్తే కేవలం బోటింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. ఇలా మొక్కుబడి ప్యాకేజీల కంటే.. పర్యాటకులకు భవానీద్వీపంలో ఆటలు పోటీలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తే బాగుంటుంది. ద్వీపంలోనే హస్తకళాకారుల షాపులను ఏర్పాటుచేస్తే పర్యాటకులు షాపింగ్ చేసే వెసులుబాటు కూడా కలుగుతుంది.

 

2-  మరిన్ని సౌకర్యాలు కల్పించాలి


 

కార్తీకమాసంలో భవానీద్వీపానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తగినన్ని మరుగుదొడ్లు నిర్మించాలి. ద్వీపానికి వచ్చిన వారంతా మినరల్ వాటర్ కొనుగోలు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల తాగునీటి సౌకర్యం కల్పించాలి.  గత ఏడాది పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో భోజనాల వద్ద తోపులాట జరిగింది. అలాకాకుండా ద్వీపంలోనే నాలుగైదు చోట్ల భోజన ఏర్పాట్లు చేయాలి. పర్యాటకులందరికీ సరిపడా భోజనాలు సిద్ధం చేయూలి. ఎండలో ఇబ్బంది పడకుండా షామియానాలు సిద్ధంచేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. నదివైపు చిన్నారులు  వెళ్లకుండా సెక్యూరిటీని పెంచాలి.

 

 3- అధికారులు శ్రద్ధ పెట్టాలి

 

ఏవిధమైన సౌకర్యాలు లేకపోయినా కార్తీకమాసంలో భవానీద్వీపానికి లక్షకుపైగా పర్యాటకులు వస్తారని లెక్కలు చెబుతున్నాయి. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఐదు నుంచి పదివేలమంది, సాధారణ రోజుల్లో వెయ్యిమంది  వరకు పర్యాటకులు వస్తారు. గత ఏడాది కార్తీకమాసానికి ఏమాత్రం ప్రచారం చేయకపోయినా రూ.16లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఏమాత్రం శ్రద్ధ చూపినా రూ.25లక్షలు దాటే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది.

 

 4-  ప్రచారమే ప్రధానాస్త్రం

 

పర్యాటకుల కోసం ఏపీటీడీసీ అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలి. కొత్త ప్యాకేజీలను జనం ముందుకు తీసుకెళ్లాలి. వనభోజనాలకు అధికంగా వచ్చే ఉద్యోగుల కోసం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయూలు, కార్పొరేట్ సంస్థల్లో ప్రచారం నిర్వహించాలి. ద్వీపంలో ఆహ్లాదంగా గడిపేందుకు ఉన్న అవకాశాలను వివరించాలి. కార్పొరేట్ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తే మంచిది. ఏపీటీడీసీ బస్సును జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపితే ఆదాయం పెరుగుతుంది.

 

 5- బోటులో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేయూలి


 

భవానీద్వీపానికి వచ్చే చాలామంది పర్యాటకులు బోటు షికారుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం భవానీపురంలోని బరంపార్కు వద్ద ప్రారంభమయ్యే బోటు సుమారు 10   నిమిషాల్లో భవానీద్వీపానికి చేరుస్తుంది. అలాకాకుండా.. టికెట్ రేటు పెంచయినా సరే.. బోటు నదిలో రెండు మూడు రౌండ్లు తిరిగేలా బోటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మధ్యమధ్యలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, బోటులోనే రకరకాల పోటీలు, విజేతలకు బహుమతులు అందిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పై అంశాలపై దృష్టి పెడితే.. భవానీ ద్వీపానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top