తొలి పరేడ్ నేడే

తొలి పరేడ్ నేడే - Sakshi


* గణతంత్ర వేడుకలకు ముస్తాబైన ఇందిరాగాంధీ స్టేడియం  

* విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్  

* నగరంలో విడిది చేసిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం


విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సోమవారం ఉదయం 7.15 గంటల నుంచి గంటా నలభై నిమిషాల పాటు వేడుకలు జరగనున్నాయి.

 

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం రాత్రికే నగరానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హాజరవుతారు. గత 15 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో రిపబ్లిక్‌డే వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, డీజీపీ రాముడులతో వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్నారు.

 

గవర్నర్ రాక

గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం విచ్చేశారు. అక్కడ నుంచి కారులో విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ గౌరవవందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ హాజరవుతారు.



500 మంది వీవీఐపీలు, 1500మంది వీఐపీలు, దాదాపు 15వేల మంది విద్యార్థులు, ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వేడుకలు జరుగుతున్న ఐజేఎం స్టేడియంలో 10 గేట్లు ఏర్పాటు చేశారు. వేడుకలు తిలకించేందుకు విచ్చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

 

భారీ భద్రతా ఏర్పాట్లు

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 19 మంది డీఎస్పీలు, 35మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, 150 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, వెయ్యిమందికిపైగా పోలీసు కానిస్టేబుల్స్, హోంగార్డులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో గత నాలుగు రోజులుగా నిఘా ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top