'గ్రామాల్లో సంపద పెరగాలి. పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్కథ

అనూహ్యకు కన్నీటి వీడ్కోలు

Sakshi | Updated: January 19, 2014 05:03 (IST)
మచిలీపట్నం/ కోనేరుసెంటరు,న్యూస్‌లైన్ : ముంబయిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శింగవరపు ఎస్తేర్ అనూహ్య (23)కు మచిలీపట్నంలో శనివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.

అనూహ్యను అంతమొందించిన మానవ మృగాలను శిక్షించాలని, ఉరిశిక్ష విధించాలని పలువురు గొంతెత్తి నినదించారు. పట్టణంలోని ఇంగ్లీషు చర్చి (అరబెల్లా) ప్రాంగణంలో అనూహ్య తాతయ్య ఎస్‌ఐవీడీ ప్రసాద్, నానమ్మ లలితమ్మ సమాధి పక్కనే క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు నోబుల్  కాలనీకి చెందిన సీఎస్‌ఐ చర్చి పాస్టర్లు సుధాకర్ తదితరులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 ఉద్విగ్న క్షణాలు...
 అనూహ్య మృతదేహాన్ని శనివారం ఉదయం ఆరు గంటలకు మచిలీపట్నం తీసుకొచ్చారు. అప్పటికే పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున నోబుల్‌కాలనీలోని ఆమె ఇంటికి తరలివచ్చారు. అనూహ్య మృతదేహాన్ని ఉంచిన శవపేటికను దించే సమయంలో అక్కడ ఉద్విగ్న వాతావరణ నెలకొంది. అనూహ్య తల్లిదండ్రులు జ్యోత్స్న, జోనాతన్ ప్రసాద్, వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ముంబయిలో స్థిరపడిన కూతురు విగతజీవిగా మారి ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు ‘భగవంతుడా... మాకు ఎంత కష్టం తెచ్చిపెట్టావ’ంటూ భోరున విలపించారు. కుమార్తె శవ పేటికపై పడి విలపిస్తున్న అనూహ్య తల్లిదండ్రులను మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో పాటు పలువురు ఓదార్చారు.

 భారీ ర్యాలీగా అంతిమయాత్ర...
 అనూహ్య అంతిమయాత్ర నోబుల్‌కాలనీలోని వారి నివాసం నుంచి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత స్థానిక చర్చిలో మృతదేహాన్ని ఉంచి ప్రార్థనలు చేశారు. అక్కడినుంచి ప్రభుత్వాస్పత్రి సెంటరు మీదుగా మాచవరం లోని ఇంగ్లీషు చర్చి వరకు యాత్ర సాగింది. అనూహ్య మరణానికి కారణమైన నిందితులను శిక్షించాలని కోరుతూ పలువురు ప్లకార్డులు చేతబూని, నల్ల రిబ్బన్లు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

 అనూహ్య మృతి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, అనూహ్య మరణంపై మిస్టరీని ఛేదించాలని, ముంబయి పోలీసుల నిర్లక్ష్యవైఖరి నశించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ అంతిమ యాత్రలో బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని), పీసీసీ కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, టీడీపీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి  కొల్లు రవీంద్ర, వైఎస్సార్ సీపీ నాయకులు మాదివాడ రాము, బొర్రా విఠల్, థామస్ నోబుల్, టీడీపీ నాయకులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, లంకిశెట్టి వనజ, కాంగ్రెస్ నాయకుడు చిలంకుర్తి పృద్వీప్రసన్న, న్యాయవాది సోడిశెట్టి బాలాజీ, మారుమూడి విక్టర్‌ప్రసాద్, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, బీజేపీ నేత దూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, ఆర్డీవో పి.సాయిబాబు, బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ వి ప్రేమ్‌కుమార్, నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ పీవీ అనీల, క్రైస్తవ సంఘాల మత పెద్దలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
అనూహ్య మృతదేహాన్ని ఖననం చేసిన అనంతరం ఆమె సమాధిపై పలువురు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అనూహ్య హత్యను నిరసిస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనూహ్య దారుణ హత్యను నిరసిస్తూ బందరు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలు విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.

 వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
 అనూహ్య కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తాతినేని పద్మావతి శనివారం పరామర్శించారు. వారు మచిలీపట్నం నోబుల్ కాలనీలోని అనూహ్య తల్లిదండ్రులను కలిసి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదంటూ అనూహ్య తండ్రి ప్రసాద్ వారి ఎదుట  కన్నీటిపర్యంతమయ్యారు.

 కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన కల్పన, పద్మావతి.. అనూహ్య హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ప్రసాద్ కుటుంబానికి కడుపుకోత మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్భయ, అభయ, అనూహ్య వంటి ఎంతోమంది అమాయక యువతులు కామాంధుల పైశాచిక చర్యలకు బలైపోతున్నారన్నారు. ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటే న్యాయస్థానాలు మరిన్ని కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయి పోలీసులు తక్షణమే స్పందించి నేరస్తులను కఠినంగా శిక్షించేలా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఆగిన భూచట్టం!

Sakshi Post

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held 

IS operatives who allegedly planned ‘lone-wolf’ attacks held

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC