స్పూర్తినింపిన 'కలాం' ల్యాప్‌టాప్

స్పూర్తినింపిన 'కలాం' ల్యాప్‌టాప్ - Sakshi


విశాఖ ఫీచర్స్ : అబ్దుల్ కలాం.. యువతరానికి ఓ స్ఫూర్తి. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చి యువతరం ఆలోచనలను నిద్రలేపిన ఓ తపస్వి. ఆయన అకాల మరణం భారతావనికి తీరనిలోటు. ఆయన యువతరానికి ఎంత స్ఫూర్తినిస్తారో నగరంలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ఆ సంఘటనకు సంబంధించి వైజాగ్‌లో 2006లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో ఏసీపీగా పనిచేసిన ఆర్‌జీవీ బద్రినాథ్ మాటల్లోనే... 2003 నంవంబర్‌లో అబ్దుల్ కలాం తిరుపతి వచ్చిన సమయంలో మా అబ్బాయి రాజా రఘునాథ్ ఆయనకు ఓ పుస్తకాన్ని అందించాడు.



అప్పటి నుంచి ఆయనతో ఆన్‌లైన్‌లో కాంటాక్ట్‌లో ఉండగా మాకు విశాఖపట్నం బదిలీ అయ్యింది. నేవీ వారోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చినపుడు కలాం మా అబ్బాయితోపాటు మా ఇద్దరు అమ్మాయిలను ప్రత్యేకంగా పిలిపించారు. ఆ సమయంలో ఆయన ముందు భారతీయులుగా పుట్టినందుకు మేము గర్విస్తున్నాం అనే అంశంపై మా అబ్బాయి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. కలాం మా పిల్లలను ప్రత్యేకంగా అభినందించి ల్యాప్‌టాప్ బహుమతిగా ఇచ్చారు.



ఆయన స్ఫూర్తితో ఈ రోజు మా అబ్బాయి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెప్పే సందేశాలు, స్ఫూర్తినిచ్చే ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆయనతో రెండు సార్లు మా పిల్లలకు ఏర్పడిన పరిచయం మా పిల్లల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. అదే సమయంలో చిన్నారుల్లో సామర్ధ్యాన్ని ఏ స్థాయిలో ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశాం. ఆయన మార్గం అనుచరణీయం, ఆయన ఆశయ సాధనే మనం ఆయనకి ఇచ్చే ఘన నివాళి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top