అంగన్‌వాడీల పోరుబాట

అంగన్‌వాడీల  పోరుబాట - Sakshi


నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్


 

విజయవాడ : ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది పోరాటానికి నడుం బిగించారు. ముందుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్    (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడంతో జిల్లాలో అంగన్‌వాడీ సిబ్బంది గురువారం తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సమాయత్తమయ్యారు. జిల్లాలో 3,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో దాదాపు ఏడు వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.



కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 2013 ఫిబ్రవరిలో 13 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేశారు. అప్పటి ప్రభుత్వం వర్కర్‌కు, హెల్పర్‌కు ఒక్కొక్కరికి రూ.800 చొప్పున వేతనం పెంచుతామని, సమ్మె కాలంలో వేతనం ఇస్తామని, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పిస్తామనే ఒప్పందంతో సమ్మెను విరమింపజేసింది. అప్పట్లో రాష్ట్రస్థాయి అధికారులు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా హామీలు అమలు చేస్తామని చెప్పారు.

 

సమ్మెకాలంలో వేతనాలకు కోత




గత ప్రభుత్వ హామీ నేటివరకు కార్యచరణకు నోచుకోలేదు. అప్పట్లో సమ్మె చేసిన 13 రోజుల వేతనాలు కూడా కోత వేశారు. ప్రస్తుతం అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.4,200, హెల్పర్‌కు రూ.2,200 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఒప్పందం ప్రకారం రూ.800 చొప్పున వేతనం పెంచాలని, సమ్మె కాలంలో కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లించాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు.

 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహించే ప్రైవేటు భవనాలకు షరతులు లేకుండా అద్దె ఇవ్వాలని, ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వోద్యోగులకు ఇచ్చేవిధంగా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. తమను పూర్తికాలపు ఉద్యోగులుగా పరిగణించి సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఈ ఆందోళనకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

 

ఎన్నికల హామీ నిలబె ట్టుకోవాలి



మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆందోళన చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించినవిధంగా అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి. గత సమ్మె కాలంలో కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లించాలి. వేతనాలు పెంచాలి. అంగన్‌వాడీలందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి.

 - సుప్రజ, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top