ప్రజాసమస్యలపై అధికారులను నిలదీయండి

ప్రజాసమస్యలపై అధికారులను నిలదీయండి - Sakshi


పుత్తూరు : ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీయండి. మీరెవరికీ భయపడవద్దు. అండగా ఉంటాను.. న్యాయం కోసం పోరాటం చేస్తాన’ని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. మంగళవారం ఆమె స్థానిక పీఆర్ అతిథి గృహ ఆవరణలో పుత్తూరు పట్టణ, మండల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నా చేతిలో ఓడిన ఆయన అధికారులపై పెత్తనం చేయడం ఏమిట’ని ప్రశ్నించారు. ఆయన చేసిన అభివృద్ధిలో ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి, సమ్మర్‌స్టోరేజీలే అని, ఇవి కూడ కమీషన్ల కోసం నిర్మించారే తప్ప వేరేది లేదన్నారు. ప్రజావసరాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఇందుకు ఉదాహరణ పుత్తూరు ప్రభుత్వాస్పత్రేనన్నారు.



ఇక్కడ మహిళా మెడికల్ ఆఫీసర్‌ను టీడీపీ నాయకులు అంతు చూస్తామంటూ బెదిరించడం వెనుక ఆయన(మాజీ ఎమ్మెల్యే) పాత్ర లేకపోలేదన్నారు. ఆమె సెలవు పెట్టి, ఆపై బదిలీ చేయించుకుని వెళ్లిందనే విషయాన్ని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. అధికారులైనా మేల్కొండని, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవడానికి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించరాదని హితవు పలికారు. ఆయన అధికారులను బెదరించుకోవడం తప్ప చేసేదేమీలేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కమీటీల ఏర్పాటుతో పాటు ఆయా మండలాల్లో ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడటానికి మరో కమిటిని నియమిస్తామన్నారు.



కాగా పార్టీకి సంబంధించి నియోజకవర్గ కార్యదర్శిగా రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బాబురావుగౌడ్ పేర్లు ప్రకటించారు. సమావేశ అనంతరం ప్రజలు రోజాకు వినతిపత్రాలు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముందుగా పుత్తూరుకు చెందిన నాయకులు కౌన్సిలర్ ఏలుమలై(అమ్ములు), సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రవిశేఖర్‌రాజు, డీసీసీబీ డెరైక్టర్ దిలీప్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ప్రతాప్, మాజీ కౌన్సిలర్ సి.నారాయణబాబు, మాజీ సర్పంచ్ సంపత్ పలు ప్రజా సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top