ఉద్యమం ఉగ్రరూపం


మచిలీపట్నం : పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. భూమి కోల్పోయే రైతులంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. వందలమంది రైతులు మచిలీపట్నం - అవనిగడ్డ రహదారిపై శివగంగ డ్రెయిన్ వంతెనపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, పోర్టును 4,800 ఎకరాల పరిధిలో నిర్మించాలని కోరుతూ నినాదాలు చేశారు.



మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాయమాటలకు స్వస్తి చెప్పి రైతుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని పలువురు రైతులు కోరారు. సర్వే పనులను అడ్డుకుంటామని, అధికారులను గ్రామాల్లోనే నిర్బంధిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని, భూములు వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు.



 రైతులది బతుకు పోరాటం...

 రాస్తారోకో నుద్దేశించి పేర్ని నాని మాట్లాడుతూ బందరు పోర్టును 4,800 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని, పోర్టు నిర్మించాలని అందరం ఉద్యమాలు చేశామని చెప్పారు. పోర్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి అనుబంధ పరిశ్రమల కోసం 25 వేల ఎకరాల భూమిని సేకరిస్తామని పాలకులు చెప్పటం దారుణమన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి, రూపాయి, రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న భూమిని పోర్టు అనుబంధ సంస్థలు స్థాపించే విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు రైతులెవ్వరూ సిద్ధంగా లేరన్నారు.



 బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మా కుటుంబానికి చెందిన భూములే 2వేల ఎకరాలు భూసేకరణలో పోతున్నాయని చెబుతున్నారని, ఎకరం భూమి కోల్పోయే రైతులకు 1400 గజాలు ఇస్తామని అంటున్నారని, రైతుల భూములు తీసుకోకుండా మీ రెండువేల ఎకరాల్లోనే పోర్టు నిర్మించాలని రైతులంతా కోరుతున్నారని చెప్పారు. రైతులది బతుకు పోరాటమని, ప్రభుత్వం భూములు తీసుకునే ప్రయత్నం మానుకోవాలని కోరారు.



సీపీఎం నాయకుడు కొడాలి శర్మ మాట్లాడుతూ ప్రజల జీవనాన్ని దెబ్బతీసే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగిస్తామన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఎకరం భూమి తీసుకుని 1400 గజాల స్థలం ఇస్తే దీనిలో మా సమాధులు నిర్మించుకోవాలా అని ఆగ్రహంతో ఊగిపోయారు. రాస్తారోకోలో పాల్గొన్న పేర్ని నాని, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ సహా మరో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ రాస్తారోకోలో వైఎస్సార్ సీపీ నాయకులు సలార్‌దాదా, మోకా భాస్కరరావు, లంకే వెంకటేశ్వరరావు, అస్గర్ తుమ్మలచెరువు, రుద్రవరం, గుండుపాలెం, కాలేఖాన్‌పేట, శారదానగర్, కోన, పాతేరు, పల్లెతుమ్మలపాలెం, గణపతినగర్, నెలితిప్ప, పోలాటితిప్ప తదితర గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top