ఇక బది‘లీల’లు


 సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అధికారుల్లో బదిలీ ఫీవర్ మొదలైంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో తమకు కావల్సిన చోట పోస్టింగ్ కోసం అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం సిఫార్సు లేఖలకు తెరదీశారు. ఇప్పటికే జిల్లా మంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లేఖలు ఇవ్వడం ప్రారంభించారు. జిల్లాలో అత్యున్నత అధికారి నుంచి కిందిస్థాయి వరకూ బదిలీలు జరిగే అవకాశం ఉంది. రెవెన్యూలో అన్ని కేడర్ల అధికారులను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలను మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఒంగోలుకు ఒక మాజీ ప్రజాప్రతినిధి ఆశీస్సులతో వచ్చేందుకు ఒక అధికారి ప్రయత్నిస్తుండగా, కందుకూరు, మార్కాపురానికి ఒక ఉన్నత ప్రజాప్రతినిధి తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఇప్పటికే రెవెన్యూ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. మిగిలిన విభాగాధిపతులు కూడా తమకు ప్రాధాన్యం ఉన్న పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు పనిచేస్తున్న వారికి ఇక్కడి నుంచి సాగనంపి వారి స్థానంలో వచ్చేందుకు అధికార పార్టీ ద్వారా పావులు కదుపుతున్నారు. పోలీసు విభాగంలో కూడా తమకు అనుకూలమైన ఎస్‌ఐలు, సీఐలను తెచ్చుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు

 

 చేస్తున్నారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన వారిని పంపించి వేయాలని ఉన్నతాధికారులపై వత్తిళ్లు తెస్తున్నారు. ఆయా శాఖలలో ప్రభుత్వం ద్వారా జరిగే పనులన్నింటినీ తమ అనుచరులకు, బినామీలకు ఇవ్వాలని పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇవ్వని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోతే బదిలీ వేటు వేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు కూడా చేస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం శృతి మించుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 తమకు తెలియకుండా ఏ ఎన్‌ఓసీ, పట్టాదార్ పాసుపుస్తకం కూడా ఇవ్వకూడదని మండలస్థాయి నేతలు హుకుం జారీ చేస్తున్నారు. పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వాలంటే ముందు ఆ నేతకు ఐదు వేలు సమర్పించుకుంటేగానీ రాని పరిస్థితి కొన్ని మండలాల్లో ఉంది. దీంతో విసిగిపోయిన అధికారులు కూడా తమను ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లిపోవడానికి సిద్ధం కాగా, మరికొందరు తమకు ఉపయోగపడే పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్‌లు ప్రారంభించారు. బదిలీల కారణంగా ఆయా కార్యాలయాల్లో పనులు కుంటుపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top