దొంగా.. దొంగా..!

దొంగా..     దొంగా..! - Sakshi


ఇది పండుగ సీజన్.. షాపులు, మార్కెట్లు కిటకిటలాడే సమయం.. విద్యాసంస్థలకు సెలవులిచ్చేశారు. చాలామంది కుటుంబాలతో సహా పండుగ కోసం ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళుతున్నారు. చోరులకు ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?.. అందుకే జిల్లాలో చోరీలు బాగా పెరిగిపోయాయి. తాళం వేసి ఉన్న ఇళ్లు గుల్లవుతున్నాయి. దే వుళ్ల ఆస్తులు కూడా దొంగల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. ఇదంతా ఒడిశా ముఠాల పనే అని అనుమానిస్తున్న పోలీసులు.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతున్నారు.

 

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొద్ది రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. అమాయకుల్లా జిల్లాలోని పలు ప్రాం తాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుస చోరీలు జరుగుతున్నా.. వాటిని నియంత్రించేందుకు తగిన సిబ్బంది గానీ, ప్రత్యేక బృందాలతో ముందస్తు ఏర్పాట్లు గానీ లేకపోవడంతో దొంగలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. పోలీసులు మాత్రం...ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటేనే చోరీలను అరికట్టగలమని ప్రకటనలు చేస్తున్నారు తప్ప ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. జిల్లాలో ఇటీవల కొత్తూరు, ఆమదాలవలస, పాతపట్నం, సోంపేట సహా శ్రీకాకుళం పట్టణంలోనూ పలు దొంగతనాలు, దోపిడీలు జరిగాయి. లక్షలాది రూపాయల సొత్తు అపహరణకు గురైంది.

 

 పస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. షాపులు, మార్కెట్లు రద్దీగా ఉంటున్నాయి. ఇదే అదనుగా ప్రజల దృష్టిని మళ్లించి దొంగలు హస్త లాఘవం ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఊళ్లకు వెళ్లినవారి ఇళ్లను గుర్తించి, చోరీలకు పాల్పడుతున్నారు. గొలుసు దొంగల తీరు మరీ ఘోరం. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరిగా తిరిగే మహిళల మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుపోతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో కూడా ప్రయాణికుల దృష్టి మరల్చి గొలుసులు తెంచుకుపోతున్న సంఘటనలు జిల్లాలో ఇటీవల వెలుగు చూశాయి. దీంతో జైళ్లలో పలు నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారి నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. ఒడిశాలో వారానికి ఒక చోట నేరం జరుగుతుండడంతో పోలీసులు అక్కడకు కూడా వెళ్లి ఇక్కడి నేరాలతో అక్కడి ముఠాలకు సంబంధం ఉందేమోనని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

 

 ఒడిశా ముఠాల పనే!

 ఇటీవల జిల్లాలో జరుగుతున్న చోరీలు, ఇతర నేరాలు ఒడిశా ముఠాల పనేనని పోలీసులు నిర్థారణ కు వస్తున్నారు. జిల్లాకు ఆనుకొనే ఒడిశా ఉండడం, అక్కడి వ్యక్తులకు నేరాల్లో ప్రావీణ్యం ఉండడం, దృష్టి మరల్చి సొత్తు దోచుకుపోవడం వారికి కొట్టినపిండి కావడంతోపాటు, గతంలో జిల్లాలో జరిగిన పలు నేర సంఘటనల్లో ఒడిశా ముఠాల పాత్ర ఉండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ ముమ్మరం చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. లాడ్జీలు, వసతి గృహాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.  సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ పోలీసులకు అందని రీతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు మాటు వేసిన ప్రాంతాలను వదిలి మిగతా ప్రాంతాల్లో తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన పలు సంఘటనలు.. పరిస్థితి తీవ్రతను ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. పలాసలో నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి జనాన్ని మోసం చేసిన మహిళా దొంగల ఉదంతం ఇటీవలే వెలుగు చూసింది.

 

  ఆమదాలవలసలో ఒకేరోజు రెండు దేవాలయాల్లో దొంగలు పడి దేవుడి ఆస్తుల్ని కొల్లగొట్టుకుపోయారు.

  కొత్తూరులో ఏకంగా ఎస్‌బీఐ ఏటీఎంనే ఎత్తుకుపోయారు. కొన్నాళ్ల తరువాత ఏటీఎం యంత్రం ముక్కలను పోలీసులు కనుగొన్నా అందులో ఉన్న సుమారు రూ.11 లక్షల నగదు, నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. నిందితుల ఆచూకీ చెబితే బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు.   సోంపేట పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే బంగారం వ్యాపారి వాహనం డిక్కీలో ఉంచిన రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, నగదును దొంగలు దోచుకుపోయారు. ఈ సంఘటనపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు.

 

   పాతపట్నంలో విశ్రాంత ఉద్యోగి పి. చలపతిరావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దొంగలు దారి కాచి బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ. లక్ష సొమ్మును దోచుకుపోయారు.   అదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను ఆయుధాలతో గాయపర్చి ఇంట్లోకి చొరబడి దొంగల ముఠా సభ్యులు సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన సంఘటన ఈ నెల 13న వెలుగు చూసింది.  శ్రీకాకుళం పట్టణంలోని సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో 700 గ్రాముల వెండిని దోచుకుపోయారు. అదే విధంగా పోలాకి మండంలంలో ఇలాంటి తరహాలోనే వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి.

   శ్రీకాకుళం పట్టణంలోనే గత కొద్దిరోజుల్లో తాళం వేసి ఉన్న రెండు మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి.

 

 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

 ప్రజల సహకారం లేనిదే పోలీసులు ఏమీ చేయలేయరు. పెద్ద మొత్తంలో సొమ్ము, నగలతో ప్రయాణిస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. పోలీసు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. అందరికీ భద్రత కల్పించడం కష్టతరంగా మారుతోంది. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. నగలతో బయటకు వచ్చే మహిళలు గొలుసు దొంగల బారిన పడకుండా చూసుకోవాలి. దసరా నేపథ్యంలో షాపింగ్‌కు వెళ్లేవారు, బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసే వారి దృష్టి మరల్చి సొత్తు దోచుకుపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అదేవిధంగా ఎవరైనా సెలవులకు వేరే ఊళ్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాం.

 -ఎ.ఎస్. ఖాన్, జిల్లా ఎస్పీ, శ్రీకాకుళం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top