తాగిన మైకంలోనే శ్రుతిమించారు

తాగిన మైకంలోనే శ్రుతిమించారు


విశాఖపట్నం : తాగిన మైకంలో చిందులేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై వికృత చేష్టలకు దిగారు. వీరి ఆగడాలు కనిపించకుండా చీకట్లు సృష్టించారు. పరారైన వీరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. దీనికి సంబంధించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం డీసీపీ డాక్టర్ రామ్‌భూపాల్‌నాయక్ విలేకర్ల సమావేశంలో వివరించారు. మల్కాపురం జనతా కాలనీలో దళిత నాయకుడుగా చెలామణి అవుతున్న కవ్వాడ వెంకటరావు, ప్రకాష్‌నగర్‌కి చెందిన మైలపల్లి పోలారావు, ఇదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ రాయ్, గుంటు రవికుమార్, మల్కాపురం హరిజనవీధికి చెందిన జోరీగల మాధవరావు, ముప్పిడి కుమార్‌రాజా స్నేహితులు. వీరు ఈనెల 23న రాత్రి ప్రకాష్‌నగర్ జంక్షన్‌లో మద్యం సేవించారు. ఇందుకోసం వీధిలో వున్న లైట్లు వెలగకుండా విద్యుత్తు వైర్ల కనెక్షన్ తెంచేశారు.



అక్కడి నుంచి మరింత మితిమీరారు. ఏ నాయకుడు ఏం చేశారని వారిలో వారు వాదించుకున్నారు. శ్రుతిమించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌పై విమర్శల దాడి చేశారు. ఎవడు అడ్డం వస్తాడో చూస్తామంటూ దగ్గర్లో వున్న ఆవుపేడని అంబేద్కర్ విగ్రహానికి పులిమారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన తరువాత రోజు వెలుగు చూడడంతో ఆందోళన వ్యక్తమయింది. మల్కాపురం పోలీస్టేషన్‌కి ఫిర్యాదు అందడంతో కేసు నమోదయింది. నిందితుల కోసం గాలించారు. శుక్రవారం ఉదయం సింథియాలో తిరుగుతున్న నిందితులను సీఐ రంగనాథ్ పోలీసులతో పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశామని డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు దళితులు వున్నారని చెప్పారు. వారిపై ఐపీసీ 153/ఎ, 295, 427 కేసులు నమోదు చేశామని, రిమాండ్‌కి తరలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏసీపీ మధుసూధన్‌రావు, సీఐ రంగనాథ్, ఎస్‌ఐ పి.రాజు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top