జన్మభూమి ఉపయోగంలేని పథకం

జన్మభూమి ఉపయోగంలేని పథకం


సదుం: సీఎం చంద్రబాబునాయుడు అమలు చేయాలనుకుంటున్న జన్మభూమి పథకంతో టీడీపీ కార్యకర్తలకు తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించా రు. సదుం మండలం చెరుకువారిపల్లెలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంతో తెలుగు తమ్ముళ్లకే అధిక ప్రయోజనం చేకూరిందన్నారు.



ప్రజలకు మేలు చేకూర్చేదానికన్నా చంద్రబాబు తన కుర్చీని కాపాడుకోవడంతో పాటు తనయుడు లోకేష్‌ను సీఎం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేసి పేదలు అందుకునే పింఛన్లను రద్దుచేసి, టీడీపీ కార్యకర్తలకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్ చిరస్మరణీయుడిగా మిగిలారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన జలయజ్ఞం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగు నీరందేదన్నారు.



జలయజ్ఞం ద్వారా తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని సీఎం కేసీఆర్ చెబుతుండగా ఆంధ్ర మంత్రులు దాన్ని తప్పుపట్టడం శోచనీయమన్నారు. దొనకొండలో రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉండేదని, చంద్రబాబు ఏకపక్షంగా విజయవాడను ప్రకటించారని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వలేదని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆయన నిర్ణయమే సరైందన్నారు.



వంద రోజుల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఐదేళ్ల తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుబ్రమణ్యం, సర్పంచ్‌లు వెంకటరమణ, నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top