రైతులను ఇబ్బంది పెట్టొద్దు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు - Sakshi


నిడమర్రు (మంగళగిరి రూరల్)

 రైతుల భూముల జోలికి రాకుండా ప్రభుత్వ భూములతోపాటు బడాపారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయం చేయనివారి భూములను రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇస్తే తనకు నిడమర్రు గ్రామంలో వున్న 53 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు.



ఎట్టి పరిస్థితుల్లో రైతుల భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోకుండా, పేద రైతులు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. రాజధాని భూసేకరణ నేపథ్యంలో నిడమర్రు గ్రామ లైబ్రరీ సెంటర్‌లో బుధవారం నిడమర్రు, బేతపూడి, కురగల్లు, నీరుకొండ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.  ఆర్కే మాట్లాడుతూ  దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఉచిత విద్యుత్ మాదిరి  చంద్రబాబు తొలి సంతకం రైతు రుణమాఫీ చేస్తారని ప్రజలు నమ్మి ఓట్లువేస్తే అయిదు నెల లైనా రుణమాఫీకి అతీగతీ లేదన్నారు.



రాజధాని పేరుతో భూములను లాక్కుం టామని రైతుల్లో ఆందోళన కలుగజేసి వారిని నిద్రపోనివ్వకుండా చేయడం దారుణమన్నారు. తన నైజాన్ని మార్చుకోని చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మళ్లీ తన నిర్ణయాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఎక్కడ ఏఏ నిర్మాణాలు చేపట్టనున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.



మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 10వేల ఎకరాల దేవాదాయ, ప్రభుత్వ అసైన్డు, అటవీ శాఖ భూములు వున్నాయని, ముందు వాటిని తీసుకోవాలని సూచిం చారు.  మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలని యత్నిస్తే రైతుల తరపున పోరాడతామన్నారు. గుండుగొలను- కాజ హైవే రహదారి నిర్మాణాలను సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని, పులిచింతల బాధితులు సైతం పరి హారం కోసం  కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారని ఆర్కే గుర్తుచేశారు.



వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కటే చెప్పారని, ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మిగిలిన పార్టీలతో కలసిపోరాడతామని, కచ్చితంగా తమ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏటుకూరి గంగాధరరావు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.



రుణమాఫీలో విఫలమైన చంద్రబాబును ఏవిధంగా నమ్మి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తారని ప్రశ్నించారు. జంగా నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, ఎంపీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమకొండ్ల నాగరత్నం,లిఫ్ట్ ఇరిగేషన్ గౌరవ అధ్యక్షుడు గాదె అంజిరెడ్డి, సింహాద్రి లక్ష్మారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.భాగ్యరాజ్, గ్రామ ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top