అంతులేని వ్యథ... ఆపలేని ప్రభుత్వం!

అంతులేని వ్యథ... ఆపలేని ప్రభుత్వం! - Sakshi


రైతు ప్రాణాలు తీస్తున్న రుణాలు

కొలిక్కిరాని ‘మాఫీ’తో కన్నుమూస్తున్న రైతు

 

హైదరాబాద్: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసి మూడు రోజులైనా గడవక మునుపే ఓ యువరైతు నిండు ప్రాణాలు గాల్లో  కలిసిపోయాయి. అన్నదాతల సంక్షేమం, రెండంకెల అభివృద్ధే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు రెవెన్యూ, బ్యాంకు అధికారులు ఏ మేరకు విలువిస్తున్నారనే దానికి నిదర్శనమే ఉరవకొండ బ్యాంకులో మోగిన చావుడప్పు. రుణమాఫీ సక్రమంగా అమలయినా, బ్యాంకు అధికారులు సకాలంలో స్పందించినా యువ రైతు కోదండరామిరెడ్డి తనువు చాల్సించాల్సిన దుస్థితి వచ్చేదే కాదు. రుణమాఫీ లెక్కలు కొలిక్కిరాక బ్యాంకులు రైతులతో దురుసుగా వ్యవహరిస్తున్నాయి.



భారతీయ సగటు రైతు మనస్తత్వం అర్థం చేసుకోలేని బ్యాంకర్లు పంట రుణాల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల్ని, బంగారాన్ని వేలం వేస్తామని బహిరంగ నోటీసులు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడంపై  ఆత్మాభిమానం దెబ్బతింటోంది. రైతు సంఘాలు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినా బ్యాంకర్లను అదుపు చేయలేకపోయారు.



పాత అప్పులు చెల్లించకుండా కొత్తవి ఇవ్వలేమని, ప్రభుత్వ గందరగోళాన్ని తమపై రుద్దవద్దని బ్యాంకర్లు స్పష్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రి.. సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదు. సేద్యం గిట్టుబాటు కాని స్థితిలో ప్రతి మూడేళ్లకూ అప్పులు చాంతాడులా పెరిగి ఉరి తాళ్లవుతున్నాయి. అప్పు కోసం తాకట్టు పెట్టిన పాసుపుస్తకాలు బయటికి రాక, తిరిగి అప్పు పుట్టక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుకిచ్చే ప్రతి రాయితీ పాసుపుస్తకంతో ముడిపడి ఉండడంతో విత్తనాలు, ఎరువులకు ఇది తప్పనిసరి. ప్రభుత్వమే వచ్చే నాలుగేళ్లు బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నప్పుడు పాసుపుస్తకాన్ని తిరిగి ఇవ్వడంలో అభ్యంతరమేమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాది కాలంలో ఎన్నడూ రైతు సంఘాలతో చర్చించిన దాఖలాలే లేవు. మరో పక్క, పాసుపుస్తకాల జారీకి రెవెన్యూ అధికారులు పెడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.



బ్యాంకర్ల వేధింపులు తారస్థాయికి..

రుణమాఫీ కొలిక్కిరాకపోవడంతో రైతులు బ్యాంకర్లు, రెవెన్యూ అధికారుల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. రైతుల్ని బిచ్చగాళ్ల మాదిరిగా చూస్తున్నారు. అప్పు చెల్లించినా పాసు పుస్తకాన్ని ఇవ్వడానికి నిరాకరించిన ఉరవకొండ బ్యాంకు మేనేజర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి.  - ఏపీ రైతు సంఘం నేత, కేవీవీ ప్రసాద్



రుణమాఫీ అమలై ఉంటే..

బాబు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలై ఉంటే ఉరవకొండ రైతు ప్రాణం దక్కేది. బ్యాంకర్లు తీరు మార్చుకోవాలి. అన్నం పెట్టే అన్నదాతను వేధిస్తే పుట్టగతులుండవని అం దరూ గుర్తించాలి. విద్యా రుణానికి పాసుపుస్తకానికి లేదు.  - నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ కిసాన్ విభాగం


ఇది కచ్చితంగా సర్కారీ హత్యే..

ఉరవకొండలో రైతు ఆత్మహత్య కచ్చితంగా సర్కారీ హత్యే. పాసుపుస్తకం కోసం ప్రాణాలు తీస్తున్న అధికారులపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. జిల్లా స్థాయిలో బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నేతలతో కమిటీలు ఏర్పాటు చేయాలి.

 - వంగల సుబ్బారావు, సీపీఎం అనుబంధ రైతు సంఘం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top