పని చేయని సర్వరు

పని చేయని సర్వరు - Sakshi


బీమా కట్టేందుకు రైతుల ఇక్కట్లు  

నేడు ఆఖరు కావడంతో ఆందోళన


బద్వేలు: బీమా కట్టేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనకు సంబంధించి కంది, సజ్జ, జొన్న, పసుపు వంటి పంటలకు సోమవారం చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పటి వరకుఅన్నదాతలు బీమా చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ జూన్, జులై నెలలో తీవ్ర వర్షాభావం నెలకొనడం, వర్షపాతం లోటు నెలకొనడంతో   పంటలు వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట దక్కపోతే బీమా అయిన పొందవచ్చనే దిశగా యోచించి ఫసల్‌బీమా కట్టేందుకు సిద్ధమయ్యారు. గతేడాది బ్యాంకులో డీడీ తీసి వ్యవసాయాధికారులు ఇచ్చిన దరఖాస్తు పూర్తి చేసి వెలుగు కార్యాలయాల్లో అందజేశారు.  ఈ ఏడాది మీసేవ కేంద్రాల్లో చలానా తీసి అక్కడే దరఖాస్తు చేసి వాటిని వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందజేయాలి. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తాకిడి పెరగడంతో మీ సేవా కేంద్రాల సర్వర్లు డౌన్‌ అయ్యాయి. దీంతో చలానాలు తీసేందుకు రైతులు  పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడో అర్ధరాత్రి సర్వర్లు పని చేసే వరకు అక్కడే ఉంటున్నారు. జిల్లాలో సాగు శాతం 40కంటే ఎక్కువ లేదు. తీవ్ర కరులు ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు బీమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సోమవారం ఆఖరు కావడంతో చలానా తీసి దరఖాస్తు చేయగలమో.. లేదో అని ఆందోళనలో ఉన్నారు.



బ్యాంకులో డీడీ తీయవచ్చు

ప్రస్తుతం చలానాతోనే కాకుండా బ్యాంకులో డీడీ తీసి దరఖాస్తు పూర్తి చేసి ఫసల్‌ బీమా యోజనకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ ఏడీఏ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం సాయంత్రం తమకు ప్రభుత్వం నుంచి ఈ ఉత్తర్వులు అందాయన్నారు. మీ సేవ కేంద్రాల్లో చలానా రాకపోయినా ఆందోళన అవసరం లేదన్నారు.  దరఖాస్తు ఎట్టి కొట్టివేతలు లేకుండా అందజేయాలని కోరారు.  పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ బుక్, పంట వేసినట్లు ధ్రువీకరణపత్రంతో డీడీతో జత పరిచి ఏడీఏ కార్యాలయంలో అందజేయవచ్చని ఆయన చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top