పాతాళంలో గంగ..రైతుల్లో బెంగ

పాతాళంలో గంగ..రైతుల్లో బెంగ - Sakshi


ఏమన్నా బాగుండావా..మీ ఊర్లో బోర్లలో నీళ్లొచ్చాన్నాయా..ఆ.. ఏం బాగోలే అన్నా.. ఇళ్లలో ఉన్న నగ నట్రా తాకట్టు పెట్టి బోర్లేపిచ్చిమి.. సుక్క నీరు పడట్లా.. శాలా మంది రైతులు 5 నుంచి 10 బోర్లు వేపిచ్చినారు.. ఒకటి రెండిట్లో కాసిన్ని నీళ్లొచ్చున్నా అవి యా మూలకూ సరిపోవట్లా.. పంటలు ఎండిపోతాన్నాయి.. వాన పడట్లేదు. ఏం సేయాలో అర్థం కావట్లా.



-  కరువు గ్రామాల  రైతులు ఏ ఇద్దరు ఎదురుపడినా వారి మధ్య జరిగే సంభాషణ ఇది.

- ఆశ చావక బోర్లు వేసి నష్టపోతున్న రైతులు

- 1000 అడుగులు వేసినా చుక్క నీరు కరువు

- అరకొర నీరొస్తున్న బోర్లూ వర్షాభావంతో ఎండిపోతున్న వైనం

- కరుణించని వరుణుడు, పట్టించుకోని ప్రభుత్వం

- కూలి పనుల కోసం వలస వెళ్తున్న చిన్న రైతులు

- అప్పుల్లో మునిగిపోతున్న మధ్యకారు రైతులు

రాయచోటి :
బోరు బావులను నమ్ముకుని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుండటం, మరో వైపు వేసిన బోర్లలో నీరింకిపోయి ఎండిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. కళ్లెదుటే పంట ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.  ఆశ చావని రైతులు అప్పుల మీద అప్పులు చేస్తూ పంటలు రక్షించుకునేందుకు భగీరథయత్నం చేస్తు న్నా ఫలితం కనిపించడం లేదు. ఇంటిల్లిపాది శ్రమించినా బతుకు భారమవుతోంది. ఆస్తులు అమ్మినా అప్పులు తీరేలా లేవు. వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఈ ఏడాది సాగు సాగట్లేదు.  



రాయచోటి, రామాపురం, చిన్నమండెం, సంబేపల్లె, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాలతో పాటు వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట మండలాల్లోని పలు గ్రామాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. ఈ పరిస్థితిలో చిన్న, సన్న కారు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుంటే కష్టమేనని కడుపు నింపుకోవడానికి ఎదో ఒక అవతారం ఎత్తాలని భావిస్తున్నారు. కూలీలుగా మారి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. బేల్దారి పనులు, కంకర కొట్టడం,ఇటుక పనులు చేసుకోవడం ఇలా ఎదో ఒక పనిలో కుదురు కుంటున్నారు. మధ్యతరగతి రైతులు అలాంటి అవతారాలు ఎత్తలేక కష్టమో, నష్టమో వ్యవసాయంలోనే తేల్చుకోవాలని ముందుకు సాగుతున్నారు. ఈ సారైనా అదృష్ట దేవత కనికరిస్తుందని భావించి బోర్లు వేయిస్తూనే ఉన్నారు. రైతుకు రుణ భారం పెరుగుతుందే తప్ప పాతాళ గంగమ్మ పైకి రావట్లేదు.

 

అరకొర నీటితో ఊరింపు

అరకొరగా నీరున్న బోర్లు సైతం వర్షాభావంతో ఎండిపోతున్నాయి. ఒక్కో రైతు 5, 10, 15, 20 బోర్లు వేసిన దాఖలాలు రాయచోటి నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. రాయచోటి మండలం మాధవరం గ్రామ పంచాయతీలోని నాగిరెడ్డిగారి పల్లెలో మొత్తం 32 కుటుంబాలున్నాయి. ఇందులో 16 రైతు కుటుంబాలున్నాయి. వీరిలో ఒక్కొక్కరు 5 నుంచి 11 బోర్ల వరకు వేశారు. ఈ విధంగా ఆ పల్లెలో వందకు పైగా బోర్లు పడ్డాయి. వేసిన బోరు ఐదారు నెలల పాటు పనిచేసి ఎండి పోవడంతో పోటీ పడి మరింత లోతుకు బోర్లు వేస్తున్నారు. 500 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు వేస్తున్నా నీరు పడలేదు. కొన్నింట్లో అరకొర నీరు వస్తోంది.



ఇలా అరకొర నీటి కోసం మోటారు, పైపులు, కేబుల్, స్టార్టర్ అన్నీ కలిపి రూ. లక్షకు పైగా ఖర్చు వస్తోంది. రాయచోటి ప్రాంతంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.  ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ జరిగి ఉంటే కొంతైనా ఊరట కలిగి ఉందేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top