అన్నదాత.. తణుకు బాట

అన్నదాత.. తణుకు బాట - Sakshi


వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలంతా అక్కడే

నేడు భారీగా  తరలివెళ్లేందుకు ఏర్పాట్లు


 

విజయవాడ : అన్నదాతలను, మహిళలను ప్రభుత్వం వంచిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం చేపట్టిన రెండు రోజుల రైతు దీక్షకు సంఘీభావంగా జిల్లాలోని రైతులు, మహిళలు భారీగా తరలి వెళ్లారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు స్వచ్ఛందంగా  బస్సులు, కార్లలో తణుకుకు వెళ్లి దీక్ష చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నీరాజనాలు పలికారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో వాహనాలు పశ్చిమగోదావరి జిల్లాకు తరలి వెళ్లడంతో జాతీయ రహదారి వాహనాలతో కిటకిటలాడింది. రోడ్డు పొడుగునా పండుగ వాతావారణం నెలకొంది. జిల్లా నుంచి వెళ్లిన రైతుల్లో అనేక మంది ఆదివారం సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకోగా, కొంతమంది రైతులు శనివారం రాత్రి జిల్లాకు వచ్చి ఆదివారం ఉదయం తిరిగి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.

 

ముఖ్య నేతలంతా తణుకులోనే...



వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలంతా శనివారం తణుకులోనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ అక్కడే ఉండి దీక్ష ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ  అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథితోపాటు జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు జగన్ దీక్షకు సంఘీభావంగా పాల్గొన్నారు. శనివారం రాత్రి జిల్లాకు తరలివచ్చిన రైతులు, మహిళలు రైతు దీక్షల విశేషాలను ఇక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి జగన్ దీక్షకు మద్దతు పలుకుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల్ని, మహిళల్ని చేస్తున్న వంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కమిటీలు, వాయిదాలంటూ రైతుల్ని మోసం చేస్తున్న వైనంపై దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని రైతులు, మహిళలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వివరిస్తున్నారు.



నేడు భారీగా తరలివెళుతున్న నేతలు...



ఆదివారం ఉదయం జిల్లా నుంచి పెద్ద ఎత్తున నేతలు, రైతులు తణుకు తరలి వెళుతున్నారు. మహిళలు, రైతులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తణుకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్‌చార్జిలు చేస్తున్నారు. కార్లు, బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల నుంచే సుమారు 200 కార్లలో తరలి వెళుతున్నారని సమాచారం. ఇక నగరంలోని కార్పొరేటర్లు, మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, సభ్యులు కూడా తమ సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పార్టీ అనుబంధ సంఘాల నేతల కూడా తణుకు వెళ్లి సంఘీభావం ప్రకటిస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top