నీ రాక కోసం..

నీ రాక కోసం.. - Sakshi


రైతు దీక్షకు తణుకులో సర్వం సిద్ధం

పాలకులకు చెంపపెట్టులా వైఎస్ జగన్ దీక్ష

వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం

జననేత కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రైతులు, మహిళలు


 

ఏలూరు : సర్కారుపై రణభేరికి సర్వం సిద్ధమైంది. టీడీపీ నయవంచక పాలనలో నిలువునా దగాపడిన రైతులు, మహిళలు, యువకులతోపాటు అన్నివర్గాల ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు తణుకులో దీక్ష బూనుతున్నారు. జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న రైతు దీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ మోసపూరిత విధానాలను  ఎండగట్టేందుకు, సీఎం చంద్రబాబు నాయుడు నయవంచక స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ జగన్ చేపట్టే దీక్ష చరిత్రాత్మకంగా నిలిచిపోయేలా పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేశారు. దగాకోరు పాలనపై ‘పశ్చిమ’ నుంచే మడమ తిప్పని పోరు మొదలు పెట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు తలంచారు. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచామని విర్రవీగుతున్న టీడీపీ నేతలకు చెంపపెట్టులా ఉండే విధంగా రైతు దీక్షను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న నేతలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 8 నెలల ప్రజాకంటక పాలనపై విసుగెత్తిన ప్రజల ఆగ్రహావేశాలను ఈ దీక్ష ద్వారా సర్కారుకు చూపిం చాలని నేతలు భావిస్తున్నారు.



మా కోసమే జగన్ నిరశన  పశ్చిమ రైతులు, మహిళల భావోద్వేగం



వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ఆందోళనలు, దీక్షలు కొత్తకాదన్న విషయంప్రజలందరికీ తెలిసిందే. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకునేందుకు, ఓదార్పునిచ్చేం దుకు ఆయన ఎంతదూరమైనా వెళ్తారన్నది జగద్విదితం. ఇప్పుడు కూడా అదే రీతిలో చంద్రబాబు పాలనలో దారుణంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన నిలిచేందుకు రెండు రోజుల నిరశన దీక్ష చేపట్టారు.  ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ జగన్ చేస్తున్న రైతు దీక్షకు ఈ జిల్లాను ఎంచుకోవడం పశ్చిమ ప్రజల గుండెలను తాకింది. తమ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న రైతు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉండాలనేది జిల్లా ప్రజల ఆకాంక్ష. నమ్మక ద్రోహానికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు ఈ దీక్ష ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకే స్వచ్ఛం దంగా దీక్షకు మద్దతు పలికేందుకు తరలివస్తున్నారు.



రాష్ట్రానికే అన్నపూర్ణగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో తాము మోసపోయినంతగా చంద్రబాబు చేతిలో ఎవరూ మోసపోలేదని రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్పించిన చంద్రబాబు తాను మారానంటే నమ్మిన జిల్లా రైతులు, ప్రజలు టీడీపీకి పట్టం కడితే కనీసం ఇక్కడి ప్రజలకు కూడా బాబు ఒరగబెట్టిందేమీ  లేదని కొద్ది నెలల్లోనే గ్రహించారు. ఎన్నికల్లో బ్రహ్మరథం పడితే అధికారంలోకి వచ్చాక బ్యాంకుల ద్వారా నోటీసులు పంపి తీవ్రంగా అవమానించడాన్ని రైతులు, డ్వాక్రా మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ చేపట్టనున్న దీక్ష వారిలో జవసత్వాలను కూడగట్టి కార్యోన్ముఖులను చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటానికి దిగిన వైఎస్ జగన్‌కు మద్దతుగా తామూ ఈ దీక్షలో పాల్గొని జిల్లా రైతుల సత్తాను చంద్రబాబుకు చూపేందుకు సన్నద్ధమవుతున్నారు.



కదంతొక్కిన నేతలు.. విస్తత ఏర్పాట్లు



రైతు దీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి మూడు రోజులుగా నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. దీక్షా స్థలి ఎంపిక నుంచి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విజయసాయిరెడ్డి స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిందిగా నేతలు, కార్యకర్తలను సూచనలు చేశారు. వారం, పది రోజులుగా పార్టీ జిల్లా సారథి ఆళ్ల నాని జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ విస్తృతంగా పర్యటించి శ్రేణులతో భేటీ అయ్యారు. రైతుదీక్ష సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఐదు రోజులుగా తణుకులోనే మకాం వేసి దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.



సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు బైక్ ర్యాలీలు, పడవల ర్యాలీలతో క్యాడర్‌లో ఓ ఊపు తీసుకువచ్చారు. ఇక  తాను పార్టీ సమన్వయకర్తగా ఉన్న తణుకులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టడంతో కారుమూరి నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మతంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. తణుకులో వైఎస్ జగన్ దీక్ష  చారిత్రాత్మకంగా నిలిచిపోవాలనే లక్ష్యంతో ఆయన దీక్ష విజయవంతం కోసం అహరహం శ్రమిస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు తమ తమ ప్రాంతాల నుంచి భారీ జన సమీకరణతో దీక్షాస్థలికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top