చినుకు కురిసె.. రైతు మురిసె

చినుకు కురిసె.. రైతు మురిసె - Sakshi


జిల్లాలో విస్తారంగా వర్షాలు ముమ్మరంగా ఖరీఫ్ పనులు

జులై నెల సగటు వర్షపాతంకంటే ఇప్పటికీ 44 శాతం తక్కువే

వెదజల్లే విధానం మేలంటున్న వ్యవసాయ శాఖ అధికారులు


సాక్షి, ఏలూరు : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న వాన కొన్ని గంటలైనా కురవాలని ఎన్నాళ్లగానో అన్నదాతలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ వచ్చారు. సాగునీరు కరువై వ్యవసాయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోతే వరి సాగు కుదరదని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోక తప్పదని ఆందోళపడుతున్న తరుణంలో నేలను వాన పలకరించింది. అది రైతు మురిసేలా చేసింది.  

 

ఇప్పటికీ తక్కువే

జిల్లాలో ఆదివారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో రైతులు ఖరీఫ్ పనులను ముమ్మరం చేశారు. వడివడిగా దమ్ములు చేస్తున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేస్తున్నారు.  సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పలుకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది మొహం చాటేశా యి. ఈ నెల రెండో వారంలో ఒకసారి వర్షం పలకరించినా ఇంతలా కురవలేదు. ఇప్పుడు మాత్రం కాస్త నిలిచి కురవటంతో రైతుల్లో సాగుపై నమ్మకం ఏర్పడింది.

 

ఈ సమయంలో సుమారు 8  మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది ఆదివారం 21.3 మిల్లీమీటర్లు కురిసింది. ఈ రోజు వర్షపాతం సాధారణం కంటే  చాలా ఎక్కువ. అయితే ఈ నెలలో నెమోదు కావాల్సిన వర్షపాతం మాత్రం తక్కువగానే ఉంది. జులై 1 నుంచి 27 వరకు 214.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 120.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటికీ 43.73 శాతం వర్షపాతం తక్కువగానే ఉంది.

 

డెల్టాలో సాగుకు నీటి కొరత లేదు

ఎగువ ప్రాంతాల్లో వానల వల్ల గోదావరిలో నీరు సమృద్ధిగా చేరుతోంది. దీంతో పశ్చిమ డెల్టాకు 7వేల క్యూసెక్కులకుపైగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల డెల్టా కింద భూములకు సాగునీటి కొరత లేదు. నిన్నమొన్నటి వరకూ విద్యుత్ కోతలతో సాగునీటికి దూరమైన మెట్టప్రాంత రైతులకు కొద్ది రోజులుగా కాస్త ఊరట లభించింది. జిల్లాలో దాదాపు 87 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులతో బోర్లపై ఆధారపడి సుమారు 52 వేల హెక్టార్లలో రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి రెండు విడతల్లో రోజుకి 6 నుంచి 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top