రేటుపైనా వేటు!

రేటుపైనా వేటు! - Sakshi


 వరుస వైపరీత్యాలు.. ఎరువులు, విత్తనాల సమస్యలు.. రుణాలు రీషెడ్యూల్ కాక తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించి.. ఆరుగాలం శ్రమించి వరి పండించిన ఖరీఫ్ రైతు చివరికి ధర విషయంలోనూ దగాకు గురవుతున్నాడు. ప్రధానంగా లెవీ సేకరణ నిబంధనలను ప్రభుత్వం మార్చేయడం.. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా లభించడం లేదు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో కనీసం మద్దతు ధరైనా లభిస్తే కొంతలో కొంతైనా గట్టెక్కవచ్చన్న అన్నదాత ఆశలు హరించుకుపోతున్నాయి.

 

 శ్రీకాకుళం అగ్రికల్చర్:ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు మద్దతు ధరకు నోచుకోక దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా ఆ రేటు ఎక్కడా లభించడం లేదు. ఎఫ్‌సీఐ లెవీ సేకరణ నిబంధనలు మార్చి 25 శాతం మా త్రమే లెవీగా తీసుకుంటామని ప్రకటించడం రైతు ల పాలిట శాపంగా పరిణమించింది. మిగతా బియ్యం తామెక్కడ అమ్ముకోగలమంటూ మిల్లర్ల మిల్లర్లు చేతులెత్తేస్తుండటంతో రైతులకు మద్దతు ధర లభించడం కష్టంగా మారింది.

 

 ఎలా చూసినా నష్టమే

 ఖరీఫ్ ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాలు రూ. 1400 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. అంటే బస్తా(75కేజీలు)కు రూ. 1050 రావాల్సి ఉంది. అలాగే సాధారణ రకానికి రూ. 1360గా నిర్ణయించడంతో బస్తాకు రూ. 1020 రావల్సి ఉంది. జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువగా స్వర్ణ, 1001 రకాలు సాగు చేశారు. సాధారణ రకమైన ప్రభుత్వం ప్రకటించిన మేరకు బస్తాకు రూ. 1020 రేటు అందాల్సి ఉండగా.. ప్రస్తుతం పొలం వద్ద రూ. 820కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అదే మిల్లుకు చేర్చితే రూ. 870 వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ధాన్యంలో 24 శాతం వరకు తేమ ఉంటున్నందునే ధర తగ్గించి కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. తేమ 20 శాతం లోపు ఉంటే బస్తాకు మరో రూ. వంద వరకు ఆదనంగా చెల్లిస్తున్నారు. ఇలా అయినా రైతులకు మద్దతు ధర దూరమే. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా బస్తాకు రూ. 200 తక్కువగా లభిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది అమ్మడం మాని ధర పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

 వ్యాపారుల ఇష్టారాజ్యం

 ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలో 100 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. వరి కోతలు దాదాపు చివరి దశకు చేరుకున్నా ఇప్పటి వరకు సగం కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన కేంద్రాల్లో పాత నిబంధనలనే అమలు చేస్తున్నారు. ప్రధానంగా తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేయాలని, లేకుంటే కేంద్రం నిర్వాహకులు నష్టపోతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. సాధారణంగా ఖరీఫ్ ధాన్యంలో కనీసం 20 శాతం తేమ ఉంటుంది. పైగా తాలుతప్పులు ఒక శాతం మించకూడదనే మరో నిబంధన ఉంది. సుడి దోమ, ఇతర తెగుళ్లు ఆశించడం వల్ల తాలు గింజలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు దాదాపు అసాధ్యమే. ఇదే అవకాశంగా తేమ వంకతో ధాన్యం వ్యాపారులు మద్దతు ధరను గాలికి వదలి, ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.

 

 ఆది నుంచీ ఒడిదుడుకులే..

 ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆది నుంచి ఒడిదుడుకులతోనే సాగుతోంది. వర్షాభావం వల్ల సాగు ఆలస్యమైంది. పంట చేతికందే సమయంలో హుద్‌హుద్ తుపాను, ఆ వెంటనే సుడిదోమ తెగులు నిలువునా ముంచేశాయి. వీటన్నింటి  వల్లా రైతులు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల వరకు దిగుబడి కోల్పోయారు. జిల్లాలో సగటు దిగుబడి 28 బస్తాలు కాగా.. చాలా చోట్ల 10 నుంచి 15 బస్తాలకే పరిమితమవుతోంది. అంటే పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి కూడా ఈ ఏడాది రెట్టింపైంది. దోమ, తెగుళ్ల అదుపునకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించారు. చివరికి ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా రాకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top