అప్పులే చావుడప్పులయ్యాయి

అప్పులే చావుడప్పులయ్యాయి - Sakshi


ఆరుగాలం శ్రమించి అందరికీ కడుపునింపే అన్నదాతను అప్పులు బలితీసుకున్నాయి. వెంటాడి వేటాడి మరీ చావు డప్పు మోగించాయి. సర్కారు హామీలను మరోసారి వెక్కి రించాయి. రుణమాఫీ భరోసాను రైతుకు దూరం చేశాయి. అప్పుల బాధ తాళలేక మార్కాపురం పట్టణానికి చెందిన     ఓ కౌలురైతు ఆదివారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మ హత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ప్రభుత్వం అమలుచేస్తున్న రుణమాఫీలో లోపాలను ఎత్తిచూపింది.

 

మార్కాపురం/మార్కాపురం రూరల్ : ‘వ్యవసాయం చేస్తానంటే నాలుగు డబ్బులు వస్తాయని ఆశపడ్డాం. చేయండంటూ ప్రోత్సహించాం. నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిర్చి పంటలు సాగుచేశాడు. సకాలంలో వర్షాలు పడకపోగా బోర్లు సైతం వట్టిపోవడంతో పంటలు ఎండిపోయాయి. సాగు కోసం చేసిన అప్పు రూ.లక్షల్లోకి చేరింది. బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకుంటే.. రుణమాఫీలో రూ.1,200 మాత్రమే మాఫీ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మా కుటుంబాన్ని అన్యాయం చేశాడు.



అసలు ఇలా చేస్తాడనుకోలేదు’... అంటూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు అచ్చయ్య (53) మృతదేహంపై పడి ఆయన భార్య నాగలక్ష్మి భోరున విలపించింది. మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో నివాసం ఉంటున్న అచ్చయ్యకు భార్య, కుమారులు శ్రీను, మనోహర్ ఉన్నారు. కుమారులిద్దరూ లారీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం మీద మక్కువతో సొంత పొలం లేకపోయినప్పటికీ మండలంలోని అమ్మవారిపల్లె గ్రామం వద్ద నాలుగు ఎకరాలను అచ్చయ్య కౌలుకు తీసుకున్నాడు.



సంవత్సరానికి రూ.40 వేలు కౌలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. నాలుగు ఎకరాల్లో ఈ ఏడాది పంటల సాగుకు అవసరమైన డబ్బు లేకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని మార్కాపురం పట్టణంలోని ఓ బ్యాంక్‌లో తాకట్టుపెట్టి రూ.1.50 లక్షల పంట రుణం తీసుకున్నాడు. అవి సరిపోకపోవడంతో తెలిసిన వారి వద్ద మరో రూ.2 లక్షల వరకు అప్పుచేశాడు. వాటితో సాగుచేసిన పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోగా, గత ఏడాది తీసుకున్న కాస్తోకూస్తో అప్పుకూడా వడ్డీతో పెరిగిపెద్దదైంది.



మొత్తం రూ.4 లక్షలకుపైగా అప్పులు కళ్లముందు కనిపించడంతో చెల్లించలేమోనన్న భయంతో వారంరోజులుగా అచ్చయ్య ఆవేదన చెందుతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీతో బ్యాంక్‌లో తీసుకున్న రుణమైనా పూర్తిగా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. కానీ, రుణమాఫీ నిబంధనల మేరకు పది రోజుల క్రితం విడుదలైన అర్హుల జాబితాలో పేరు ఉన్నప్పటికీ కేవలం రూ.1,200 మాత్రమే మాఫీ అయింది.



దీంతో అచ్చయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండురోజుల నుంచి ఇంట్లో అన్నం కూడా తినకుండా గడుపుతున్నాడు. శనివారం ఉదయం బయటకువెళ్లివస్తాననిచెప్పి తిరిగి రాలేదు. రాత్రంతా ఎదురుచూసిన భార్య ఆదిలక్ష్మికి ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో దరిమడుగు పాఠశాల వద్ద అచ్చ య్య పడి ఉన్నాడని తెలిసింది. హడావిడిగా వెళ్లి చూడగా నిర్జీవంగా అచ్చయ్య పడి ఉన్నాడు. వ్యవసాయం చేయకపోయినా తన భర్త తనకు దక్కిఉండేవాడంటూ ఆమె విలపించిన తీరు చూపరులను కలచివేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top