రుణమాఫీ.. అయోమయం

రుణమాఫీ.. అయోమయం - Sakshi


కడప అగ్రికల్చర్: తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీకి నానా షరతులు విధించడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 2013 సంవత్సరంలో పంటల సాగుకోసం రైతులు భూములను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాగే బంగారును కుదువ పెట్టి రుణాలు పొందారు. రైతన్నలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలోనూ, మేనిఫెస్టోలోనూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రైతులు తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే రుణమాఫీపై మొదటి సంతకమంటూ ఊదరగొట్టారు. తీరా పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చి నానా షరతులు విధించి రైతులను గందరగోళానికి గురిచేస్తూ జీఓలు జారీచేశారు.



ఈనెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 164 జీఓను విడుదల చేస్తూ ప్రతి రైతు కుటుంబానికి ఒకటిన్నర లక్ష రూపాయలు మాఫీ అంటూ చెప్పింది. అయితే పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, రుణం తీసుకున్న బ్యాంకు ఖాతా నంబరుతో కూడిన పత్రాలు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ పత్రాలు సమర్పించేందుకు ఈనెల 28వ తేదీ వరకు గడువు విధించారు. అయితే ఇందులో ఆధార్‌కార్డు తప్పనిసరి చేశారు. చాలామంది రైతులకు ఈ ఆధార్‌కార్డులకు ఐరిష్ పూర్తిచేసినా కార్డులు మాత్రం చేరలేదు.



దీంతో రైతులు రుణమాఫీలో అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 2013 ఖరీఫ్‌లో మొత్తం 6 లక్షల 38 వేల 421 మంది రైతులు అన్ని రకాల పంట రుణాలను కలిపి రూ.8187.62కోట్లు తీసుకున్నారు. ఇందులోనే బంగారు రుణాలను 2 లక్షల 15 వేల 836 మంది రైతులు రూ.2093.12 కోట్లు పొందారు. పంట రుణాలు, బంగారు కుదువ పెట్టి పంట సాగు కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఒక వైపు చెబుతూ మరో వైపు బ్యాంకులకు ఇచ్చిన అప్పు పత్రాలలో తప్పనిసరిగా ఆ సంవత్సరంలో పెట్టిన పంట వివరాల కాలం పూర్తి చేసి ఉంటేనే రుణాలు మాఫీ అవుతాయని బ్యాంకర్లు కొత్త వాదన తీసుకొస్తున్నారు. అయితే ఇది మాత్రం జీఓలో పొందుపరచలేదు.



అలాగే 2011 సంవత్సరం రబీలో పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్నాయి. ఇందులో వరి, వేరుశనగ, పత్తి, ఉల్లి, మిరప, కొర్ర, జొన్న, సజ్జ, అలసంద, ఆముదం పంటలు ఉన్నాయి. వీటికి ఇప్పుడు పంట పెట్టుబడి రాయితీ కొన్ని మండలాలకు విడుదలైంది. విడుదలైన పెట్టుబడి రాయితీని బకాయి ఉన్న రైతుల ఖాతాల నుంచి బకాయిలకు జమ చేస్తున్నామని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు తీవ్రంగా మథన పడుతున్నారు. ఇది చాలా అన్యాయమని రైతు సంఘాలు బ్యాంకర్లకు మొర పెట్టుకుంటున్నా వినడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



తాము పంటల సాగు కోసం అప్పులిచ్చామని, వాటిని తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు మనుగడ సాధించడం గగనంగా ఉంటుందని మరో వైపు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కొందరు బ్యాంకర్లు కొత్తగా ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కంప్యూటర్లలో రికార్డు చేసిన 1బీని మీ సేవలో తీసుకోవాలని, దాన్ని బ్యాంకులకు అందజేయాలనే కొత్త వాదన తీసుకురావడంతో రైతులు మీసేవ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.



రుణ మాఫీకి సంబంధించి  సరైన విధానమంటూ లేకపోవడం, జీఓలో కూడా 26 రకాల అంశాలు ఉండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మొత్తం మీద రుణమాఫీ అవుతుందా లేదా అని చర్చించుకోవడం తప్ప చేసేదేమీలేక అల్లాడుతున్నారు. రుణాలు రీషెడ్యూలు చేసేందుకు తమకెలాంటి ఆదేశాలు రాలేదని బ్యాంకర్లు అంటున్నారు. బ్యాంకర్లు మాత్రం తీసుకున్న రుణాలను వడ్డీ సహా తిరిగి చెల్లిస్తే కొత్త రుణాలు ఇస్తామని తెగేసి చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top