ఉద్రిక్తం..


 సీతానగరం : ఎన్‌సీఎస్ యాజమాన్యం రైతులకు బాకీపడిన బిల్లుల చెల్లింపుల్లో అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ రైతుసంఘం నిర్వహించ తలపెట్టిన రహదారుల దిగ్బంధనం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కర్మాగారం గేటు వద్ద చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, రెడ్డి లక్ష్మునాయుడు, రెడ్డి ఈశ్వరరావు, గేదెల సత్యనారాయణ, బి.అప్పారావు, సీడీసీ చైర్మన్ ఎన్.రామకృష్ణలతోపాటు మరికొంతమంది కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే బొబ్బిలి డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో కర్మాగారాన్ని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. సమావేశం జరిగినంత వరకూ పక్కనే ఉన్న దేవాలయం వద్ద సేదతీరారు.

 

 ఈలోగా కొంతమంది రైతు సంఘం కార్యకర్తలు ఉదయం 11 గంటల సమయంలో రహదారి దిగ్బంధనానికి సిద్ధమయ్యారు. డీఎస్పీ కలగజేసుకుని... సమస్యలపై శాంతియుతంగా సమావేశాన్ని, ధర్నాను నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేగానీ రహదారి వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటే సహించబోమని, ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. యాజమాన్యం నుంచి ఇప్పటికే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయని సంఘ నాయకులకు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో పోలీసులు, రైతుసంఘ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. రహదారిపై టెంట్లు వేస్తున్న వారిని, ఆందోళనకారులను అడ్డుకుని పోలీసులు వాహనాల్లో బొబ్బిలి వైపు తరలించారు.

 

 బిల్లులు చెల్లించాలి...

 అంతకముందు రైతు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులకు బిల్లు బకాయిలను  తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు  2013-14,2014-15 క్రషింగ్ సీజన్‌లలో చెల్లించవలసిన 19 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిరసనలు చేస్తే అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అరెస్ట్‌లు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. ఎన్‌సీఎస్ కర్మాగారం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహశీల్దార్ బి.సత్యనారాయణ, బొబ్బిలి డీఎస్‌పీ బి.వి.రమణమూర్తి సమీక్షించారు. రోడ్డు దిగ్భంధనం చేస్తే వచ్చిన సమస్యలపై చర్చించారు. రైతులకు బాకీపడిన బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, బొబ్బిలి సబ్‌డివిజన్‌లలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 9 మంది నాయకుల అరెస్ట్ : 40 మంది రైతులను వివిధ స్టేషన్లకు తరలింపు

 బొబ్బిలి : లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద ఆందోళన చేసిన రైతులకు, పోలీసులకు మధ్య శుక్రవారం వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాడి చేయడం తో తనకు గాయమైందని సీతానగరం మండలంబక్కుపేటకు చెందిన మడక తిరుపతి అనే రైతు బొబ్బిలిలో విలేకరులకు చూపించారు. కాగా, ఆందోళన జరిగిన చోట దొరికిన వారిని దొరికినట్లుగా పోలీసులు పట్టుకొని జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఎక్కువ మంది రైతులు, నాయకులను బుదరాయవలస పోలీసు స్టేషనుకు తరలించారు. 41 మంది రైతులను ప్రాథమికంగా అరెస్టు చేశారు. రైతు సంఘ నాయకులు, వివిధ పార్టీలు, విప్లవ సంఘాల నాయకులపై మాత్రం కేసులు నమోదు చేశారు. పోలీసులపై తిరగబడటం, రహదారులను దిగ్బంధనం చేయడంపై 9 మంది నాయకులను అరెస్టు చేశారు. వీరిలో ఏపీ చెరకు రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, రైతు సంఘ నాయకులు రెడ్డి ఈశ్వరరావు, శ్రీరామ్మూర్తి, లక్ష్మంనాయుడు, సీపీఐ జిల్లా నాయకులు ఒమ్మి రమణ, వెలగాడ కృష్ణ, పోల రమణి, గేదెల సూర్యనారాయణ, సాహు తదితరులను అరెస్టు చేసినట్లు సీఐ తాండ్ర సీతారాం తెలిపారు.

 

 ఆందోళనకారులను బుదరాయవలస తరలించిన పోలీసులు

 బుదరాయవలస(మెరకముడిదాం): సీతానగరంలో రహదారి దిగ్బంధానికి పాల్పడిన ఆందోళనకారులను, రైతులను, సీపీఎం నాయకులను పోలీసులు బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 49 మందిని బుదరాయవలస పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. అయితే, పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని, బలిజిపేట ఎస్‌ఐ పి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు డి.ప్రశాంత్, ఆర్.శ్రీనివాసరావు తదితరులు రక్తం కారేలా దాడి చేశారని పలువురు సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం సీతానగరం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావుకు ముక్కుపైన, చెరుకు రైతులు ఉరుముల భూషణ  కాలుపైన, రెడ్డిసత్యనారాయణ కుడికాలు ముక్కుపైన, వాసిరెడ్డి కృష్ణారావుకు ఎడమ భుజంపైన ఈ ఘటనలో దెబ్బలు తగిలాయి. మిగిలిన పలువురు రైతులకు ముఖాలపైన దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న చీపురుపల్లి సీఐ ఎస్.రాఘవులు, గరివిడి ఎస్‌ఐ వర్మలు బుదరాయవలస స్టేషన్‌కు చేరుకొని సిపిఎం నాయకులతో మాట్లాడారు. తమను అకారణంగా కొట్టిన బలిజిపేట ఎస్‌ఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు డి.ప్రశాంత్, ఆర్.శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి సీఐకి సిపిఎం నాయకులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top