మిగిలేది మొండిచేయే

మిగిలేది మొండిచేయే


సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు జిల్లాలో 34,180.22 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. 9589 హెక్టార్లలో వరి, 20,137 హెక్టార్లలో చెర కు, 468 హెక్టార్లలో పత్తి, 209 హె క్టార్లలో కందులు, 121 హెక్టార్లలో  మొక్కజొన్న, 3209 హెక్టార్లలో రాజ్‌మా, 11 హెక్టార్లలో మినుము, 66 హెక్టార్లలో వేరుశనగ, 321 హెక్టార్లలో రాగులు, 48 హెక్టార్లలో పొగాకు దెబ్బతిన్నట్టుగా అధికారులు నిర్ధారించారు.1, 55,915 మంది రైతులు నష్టపోయినట్టు లెక్కలు తేల్చారు. వీరికి రూ.49.18కోట్ల మేర ఇన్‌పుట్‌సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. హార్టికల్చర్ పంటలకుసంబంధించి 55,334.608 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా  లక్షా 62 వేల మంది రైతులు నష్టపోయినట్టు నిర్ధారించారు.



జిల్లాలోని  రెండులక్షల మంది రైతుల్లో సొంతంగా సాగుచేసేది  50 నుంచి 70వేల మందే. మిగిలిన వారంతా కౌలురైతులే. భూయజమానికి..వీరికి మధ్య అవగాహన ఒప్పందం (నోటి మాటతోనే) కౌలుసాగుతుంటుంది. గత ప్రభుత్వం కౌలు అర్హత కార్డులు జారీకి శ్రీకారం చుట్టింది. సరైన అవగాహన, చైతన్యం కొరవడడం.. లిఖిత పూర్వకంగా ఎలాంటి కౌలు ఒప్పందాలు లేకపోవడం, అసలు రైతులు ఇబ్బందులు వెరశి కౌలు అర్హత కార్డులు పొందిన వారు జిల్లాలో చాలా తక్కువనే చెప్పాలి.

 

2012-13లో కార్డులు పొందిన వారు 50వేల మంది వరకు ఉంటే 2013-14లో ఈ సంఖ్య 35వేలకు మించలేదు. ఇక ఈఏడాది ఇప్పటి వరకు రెన్యువల్ చేయించుకున్న వారు కేవలం 10,783మంది మాత్రమే. వీరిలో బ్యాం కుల ద్వారా రుణాలు పొందిన వారు.. పంటలకు బీమా చేయించుకున్న వారి సంఖ్య రెండుమూడువేలకు మించరని అధికారులే పేర్కొంటున్నారు. ఈ లెక్కన హుద్‌హుద్ దెబ్బకు పంటలుకోల్పోయిన కౌలు రైతుల్లో నూటికి 90 శాతం పరిహారానికి నోచుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం జరిగిన పంటనష్టం అంచనాల సర్వేలో భూయజమానుల పేర్లనే జాబితాలో చేర్చారుతప్ప ఏ ఒక్క గ్రామంలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో కౌలురైతులకు చోటు దక్కలేదు.



రుణాల మంజూరుకు బ్యాంకులు ముఖం చాటేయడంతో బంగారు నగలను కుదువపెట్టడం అవి సరిపోకపోతే ఐదు రూపాయల వడ్డీకి అప్పు చేసి మరీ సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. బీమా కాదుకదా కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఒక పక్క చేతి కంది వచ్చిన పంట తుఫాన్ పాలవ్వగా, మరోవంక ప్రభుత్వ సాయం అందక వీరు మరింత అప్పుఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో విచారిస్తే ఏ భూమిలో ఎవరుసాగు చేస్తారో చెబుతారు.. లేదా వీఆర్వోలు.. ఏవోలను అడిగినా చెబుతారు.. వాటిని ప్రామాణికంగానైనాతీ సుకుని తమకు పరిహారం జాబితాలో చోటు కల్పించాలి. భూమియజమానులుకూడా ఉదారంగా స్పందించి కనీసం పరిహారంలో కొంత భాగమైనా ఇవ్వాలి. అప్పుల ఊబిలో ఉన్న తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు పేర్కొంటున్నారు.

 

ఏదీ వర్తంచదంటున్నారు.

నాది నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట. పదెకరాల పొలం కౌలుకు తీసుకున్నా. ఈ ఏడాది వరిపంట వేశా. తుఫాన్‌కు పూర్తిగా దెబ్బతినిపోయింది. బాధిత రైతుల జాబితాలో నాకు చోటు దక్కలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం, పంటల బీమా కూడా రావంటున్నారు. బ్యాంకులు రుణాలివ్వడం లేదు. బీమా చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. కనీసం దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించక పోతేమా గతేంటి..యజమాని కనికరించకపోతే అప్పులు పాలవ్వాల్సిందే.

 -పైల నూకన్ననాయుడు, కౌలు రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top