మా శవాలపై రాజధాని కట్టుకోండి..

మా శవాలపై రాజధాని కట్టుకోండి.. - Sakshi


సర్కారుపై ‘రాజధాని గ్రామాల’ రైతుల ఆగ్రహం

స్వతంత్రంగా బతుకుతున్న మమ్మల్ని రోడ్డున పడేస్తారా?

ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. సెంటు భూమి కూడా ఇవ్వం

వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఎదుట స్పష్టంచేసిన రైతులు


 

సాక్షి, గుంటూరు: రాజధాని కోసమంటూ తమ భూములను అప్పనంగా కాజేసే కుయుక్తులపై కర్షక లోకం కన్నెర్ర చేస్తోంది. కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని భూమిలో బంగారం పండించే భూమిపుత్రులంతా పోరాటానికి సన్నద్ధమయ్యారు. భూసమీకరణ పేరుతో అడ్డగోలుగా భూములను సొంతం చేసుకుకోవాలనుకుంటున్న సర్కారు పెద్దలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.



తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సెంటు భూమి ఇచ్చేదిలేదని.. తమ భూములు తీసుకునే రాజధాని నిర్మించాలనుకుంటే తమ శవాలపైనే ఆ రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ‘‘రైతులను మోసం చేశావు... జనాల్ని మోసం చేస్తున్నావు... ఇప్పుడు హైటెక్ మోసంతో మా భూములు తీసుకోవాలని చూస్తున్నావు. మీకు ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగింది. 200 వాగ్దానాలు చేశావు, ఇక్కటైనా నెరవేర్చావా?’’ అంటూ.. రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల రైతులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా పొలాలు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేద్దామనా?’’ అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.ఆదివారం ఆ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పర్యటించి రైతుల మనోగతాన్ని తెలుసుకున్నారు.

 

ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే పోరాడతాం: వైఎస్సార్ సీపీ

గుంటూరు జిల్లాలో రాజధాని కడితే ఆనందమే.. కానీ రైతులు నష్టపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టంచేశారు.  రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బడాబాబులు బినామీ భూములను జాగ్రత్త చేసుకుని.. రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అయిదడుగుల్లోనే నీరు పడే ప్రాంతాల్లో రాజధాని నిర్మించాలంటే ఖర్చుతో కూడిన పనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు పార్టీలతో పనిలేదని, పేద రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రైతుల కు నచ్చేవిధంగా ఉండాలి గానీ, ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే పోరాడతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రైతులకు హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top