విత్తన నిర్లక్ష్యంపై ఆగ్రహం


ఒంగోలు టూటౌన్ : జిల్లాలో రైతులు విత్తనాలు అందక కన్నెర్ర చేశారు. విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయశాఖ నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు సకాలంలో విత్తనాలు అందని దుస్థితి నెలకొంది. మొలక శాతాన్ని పరీక్షించి రైతులకు విత్తనాలు ఇవ్వాలి. విత్తనంలో నాణ్యతాలోపం ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మంచి విత్తనం రప్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు.



ఫలితంగా అరకొర నాణ్యత ఉన్న విత్తనాలనే తీసుకువెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి...అల్పపీడన ప్రభావంతో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల సాగర్ నీళ్ళు కూడా వదలడంతో వరి నార్లు పోసుకునేందుకు సిద్ధమైన రైతులు విత్తనాల కోసం ఒంగోలుకు తరలివస్తున్నారు.



గత నాలుగు రోజులుగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులకు విత్తనాలు ఇవ్వకుండా రేపు,మాపు అంటూ తిప్పుకుంటుండడంతో బుధవారం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతో దూరం నుంచి వచ్చిన రైతులు తిరిగి వెళ్లలేక ఒంగోలులోనే లాడ్జీల్లో ఉంటూ త్రోవగుంటలో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ వద్దకు.. అక్కడ నుంచి విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వాస్తవ పరిస్థితి చెప్పకుండా వాయిదా వేయడంతో కార్యాలయాన్ని చుట్టుముట్టారు.



 ఈ విషయం తెలిసిన ఏపీ రైతు సంఘం నాయకులు కె.వి.వి. ప్రసాద్, హనుమరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు అండగా నిలిచారు. వరి నాట్లు పోసుకునేందుకు రైతులు గత నాలుగు రోజులుగా విత్తనాల కోసం తిరుగుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమటని సంబంధితాధికారులను నిలదీశారు. మే నెలలో వరి విత్తనాలు వస్తే ఇప్పటి వరకు వాటి మొలక శాతం పరీక్షించకపోవడం దారుణమన్నారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, తాళ్ళూరు, దర్శి, కురిచేడు, గుంటూరు జిల్లా నూజెళ్ళ నుంచి 300 మంది రైతులు విత్తనాల కోసం వచ్చారు. రోజుకి రూ.200 పైనే చార్జీలు పెట్టుకొని వస్తుంటే వాయిదాలు వేయడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  రైతు సంఘం నాయకుల ద్వారా విషయం వ్యవసాయ శాఖ జేడీ జె.మురళీకృష్ణ దృష్టికి వెళ్లడంతో విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు.



 హైదరాబాద్‌లోని విత్తనాభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్‌తో ఫోన్‌లో రైతు సంఘం నాయకులు మాట్లాడగా అసలు విషయం బయటపడింది. మొలక శాతం 80 శాతం ఉండాల్సి ఉండగా.. కేవలం 58 నుంచి 68 శాతం మాత్రమే ఉండటంతో అధికారులు విత్తనాలు ఇవ్వడంలేదని తెలిపారు. అయినా సరే అవే విత్తనాలు ఇవ్వాలని రైతులు పట్టుబట్టడంతో జేడీ సూచనమేరకు పంపిణీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top