కమ్ముకొస్తున్న కరువు!

కమ్ముకొస్తున్న కరువు! - Sakshi


 విజయనగరం వ్యవసాయం: జిల్లాపై కరువుమేఘాలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలో ఆందోళన మొదలైంది. నారుపోసి 60 రోజులువుతున్నా ఇంతవరకు నాట్లు పడకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నారు ఎండిపోవ డంతో   మళ్లీ విత్తనాలను వేస్తున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ప్రకృతి, ప్రభుత్వం కరుణించకపోవడంతో రైతులు అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.  రుణమాఫీ చేస్తామన్న సర్కార్ ఇంతవరకు మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కూడా అందలేదు.   

 

 ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి మదుపులు పెట్టారు.  అయితే సరైన వర్షాలు కురవకపోవడంతో చాలా ప్రాంతాల్లో నారు ఎండిపోయింది.   మడిలో తడికోసం కన్నుల నిండా నీళ్లు నింపుకొని ఎదురుచూస్తున్నాడు.   విజయనగరం డివిజన్‌లో ఉన్న 19 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నారు ఎండిపోవడంతో విత్తనాలకోసం  రైతులు వ్యవసాయధికారులను ఆశ్రయిస్తున్నారు.    గత ఏడాది ఇదే సమయానికి దాదాపు నాట్లు వేయడం పూర్తికాగా,  ఈఏడాది పరిస్థితి  అందుకు భిన్నంగా ఉంది.  ఇప్పటికి 50 శాతం నాట్లు కూడా పడలేదు.  విజయనగరం డివిజన్ కన్నా, పార్వతీపురం డివిజన్ కొంత మేర అదనంగా నాట్లు పడ్డాయి.

 

 తగ్గిన సాగు విస్తీర్ణం

 జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 1,16,536 హెక్టార్లుకాగా, ఇంతవరకు 38,836హెక్టార్లులో నాట్లు వేశారు. వేరుశెనగపంటది అదే పరిస్థితి. 17,512 హెక్టార్లకుగాను 4798 హెక్టార్లలో,   గోగు  14,618 హెక్టార్లకుగాను 2787హెక్టార్లలో మాత్రమే వేశారు. జొన్న 431 హెక్టార్లకుగాను 13హెక్టార్లు,  సామ 527హెక్టార్లకుగాను 19 హెక్టార్లలో వేశారు. కొర్ర 262 హెక్టార్లకుగాను 16 హెక్టార్లు, మినుము1,554 హెక్టార్లకుగాను 193హెక్టార్లు , పెసర 1,405హెక్టార్లకు గాను 302 హెక్టార్లు, శెనగ 1,885 హెక్టార్లకు గాను 261హెక్టార్లలో మాత్రమే వేశారు. ఇక పొగాకు, చిరుధాన్యాల పరిస్థితి మరీ ఘోరం. పొగాకు 197 హెక్టార్లకు గాను ఒక్క హెక్టారులో కూడా సాగవలేదు.  చిరుధాన్యానాలు 962 హెక్టార్లకుగాను ఒక హెక్టారులో కూడా వేయలేదు.

 

 అన్నదాతపై అదనపు భారం

 నీరు లేక గతంలో వేసిన వరినారు ముదిరిపోవడంతో రైతులు మళ్లీ నారువేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరి నారు వేసిన 22 రోజులు తర్వాత నాట్లు వేయాలి.  దీని వల్ల పంట అనుకున్న స్థాయిలో దిగుబడి వస్తుంది. తెగుళ్లు కూడా ఆశించవు. అయితే వర్షాలు కినుకు వహించడంతో నారు ముదిరిపోయింది. ముదిరిన నారు వేయడం వల్ల  దిగుబడి సగానికి తగ్గిపోవడంతోపాటు తెగుళ్లు అధికంగా సోకే  ప్రమాదం ఉంది. దీంతో ఎండిపోయిన నారును విడిచిపెట్టి  కొత్తగా నారు వేసేందుకు రైతులుమళ్లీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది.

 

 10 శాతం కూడా

 పడని నాట్లు

 జిల్లాలో మెరకముడిదాం, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, గరివిడి,చీపురుపల్లి,బొండపల్లి, ఎస్.కోట,వేపాడ,ఎల్.కోట, జామి, విజయనగరం,పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, కొత్తవలస, గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో 10 శాతం కూడా నాట్లు పడలేదు.

 

 నాపేరు అల్లి మల్లు నాయుడు. మాది నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామం.  నాకు రెండు ఎకరాల పొలం ఉంది. దీనికోసం 1001 రకం విత్తనాలను రెండు నెలల క్రితం మూడు ప్యాకెట్లు వేశాను. వర్షాలు పడకపోవడం వల్ల నారు ఎండిపోయింది.   ఇప్పుడు మళ్లీ తేలికపాటి రకాలైన నెల్లురు సన్నాలు  విత్తనాలు కొనుగోలు చేయడంకోసం వచ్చాను. గతంలో మూడు ప్యాకెట్లుకు రూ.1800 పెట్టాను. అది బూడిదలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్లీ విత్తనాలకు రూ. 1200 అయింది.

 

 నాపేరు  కాకి సూరమ్మ. మాదా నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామం నాకు ఎకరం పొలం ఉంది. ప్యాకెట్టున్నర 1001 విత్తనాలు వేశాను. వర్షాలు పడకపోవడం వల్ల   ఎండిపోయింది. అప్పుడు రూ.900 పెట్టాను. ఇప్పుడు మళ్లీ రూ.600 పెట్టి విత్తనాలు కొనుగోలు చేసాను. నాలాంటి పేదరైతుకు ఇది అదనపు భారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top