మ‘రుణ’ శాసనం

మ‘రుణ’ శాసనం - Sakshi


* ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో పురుగులమందు తాగి యువ రైతు ఆత్మహత్య

* వ్యవసాయ రుణ మాఫీ కాక నిర్వేదం

* ఎలాగో రుణం తీర్చినా పాసు పుస్తకాలు దక్కలేదు

* ఇతర రుణాలతో ముడిపెట్టిన బ్యాంక్ అధికారి




సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ‘కరువు’ దెబ్బకు కళ్ల ముందే ఎండిపోతుంటే ఆ రైతు గుండె తరుక్కుపోయింది. రుణమాఫీ అవుతుందనుకుంటే కాలేదు. సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు రూ.లక్షన్నర మేరకైనా రుణమాఫీ ఊరటనివ్వలేదు. ఆర్థిక ఇబ్బందులకు ఉరవకొండ సిండికేట్ బ్యాంకు అధికారుల వేధింపులు తోడయ్యాయి. తల్లి పేరుతో తీసుకున్న రుణాన్ని చెల్లించినా , ‘చెల్లి’ చదువు కోసం తీసుకున్న లోను కడితేనే పాసు పుస్తకం ఇస్తానన్నారు. ఇదే విషయంపై  వారం కిందట ఆవేదనగా మేనేజర్‌ను నిలదీశాడు. పోలీసులను పిలిపించిన మేనేజర్ బ్యాంకులోనే రైతును కొట్టించాడు. అవమానంతో కుంగి పోయాడు.



ఆశ చావక తాజాగా గురువారం మళ్లీ మేనేజర్ వద్దకు వెళ్లి పాసుపుస్తకం కోసం ప్రాథేయపడ్డాడు. ఫలితం దక్కక చివరికి  బ్యాంకు ఆవరణలోనే పురుగుమందు తాగాడు. ఇదీ ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామానికి చెందిన యువరైతు కోదండరామిరెడ్డి (29) దీన గాథ. హైదరాబాద్‌లో ఎంబీఏ చదివాడు. తండ్రి చనిపోవడంతో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. మూడేళ్ల కిందట చెల్లి శ్రీలక్ష్మి వివాహం కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.6 లక్షల అప్పు చేశాడు.



ఇందుకోసం తన తల్లి నారాయణమ్మ పేరుతో ఉన్న 5 ఎకరాలకు సంబంధించిన పొలం పత్రాలను మూడేళ్ల  గడువుతో తాకట్టుపెట్టాడు. మరోవైపు నారాయణమ్మ పేరుతో అప్పటికే ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో రెండేళ్ల కిందట పాసుపుస్తకాలను తాకట్టుపెట్టి తీసుకున్న రూ.64 వేల వ్యవసాయ రుణం ఉంది. తొలి అప్పు గడువు సమీపిస్తుండంతో బ్యాంకులో తల్లిపేరుతో ఉన్న పాసుపుస్తకాలను విడిపించి, ఆ పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.



తన తల్లి పేరుమీద ఉన్న రూ.64 వేల అప్పులో రుణమాఫీ ద్వారా కేవలం రూ.7 వేలు మాఫీ అయ్యింది. 20 రోజుల కిందట తక్కిన బకాయి మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించి తల్లిపేరుతో ఉన్న పాసుపుస్తకాలను ఇవ్వాలని కోదండరామిరెడ్డి బ్యాంకు మేనేజర్ శివశంకర్‌ను కోరాడు. కానీ చెల్లి చదువుకోసం తీసుకున్న

 

తక్కిన బకాయిలూ చెల్లించాలన్న మేనేజర్

కోదండరామిరెడ్డి పేరుతో 6 ఎకరాల పొలం ఉంది. దీనికి సంబంధించిన పాసుపుస్తకాలను అదే బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.2 లక్షల అప్పు చేశాడు. అలాగే చెల్లి బీటెక్ చదువుకోసం 2009లో అదే బ్యాంకులో తీసుకున్న రూ.1.25 లక్షల అప్పుకూడా ఉంది. దీంతో నారాయణమ్మ పేరుతో ఉన్న పాసుపుస్తకాలకు సంబంధించిన అప్పు తీర్చినా, కుటుంబానికి సంబంధించిన ఇతర రుణం కూడా పూర్తిగా చెల్లించాలని, అప్పుడే పాసుపుస్తకాలను ఇస్తానని బ్యాంక్ మేనేజర్ తేల్చిచెప్పాడు.



ఈ నేపథ్యంలోనే కోదండరామిరెడ్డి పలుమార్లు పాసు పుస్తకాలు ఇవ్వాల్సిందిగా ప్రాథేయపడ్డాడు. బ్యాంకర్ ససేమిరా అన్నాడు. తల్లిపేరుతో ఉన్న పొలాన్ని బయట విక్రయించాలంటే బ్యాంకులోని పాసుపుస్తకాలు రావాలి. పుస్తకాలు రాకపోతే... పొలం రూ.6 లక్షలకే పరాయివాళ్ల పరం అవుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఉరవకొండలో పురుగులమందు కొని గురువారం బ్యాంకుకు వెళ్లాడు. పాసు పుస్తకాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మేనేజర్‌ను హెచ్చరించాడు. అయినా మేనేజర్ కనికరించలేదు.



మేనేజర్ ఎదుటే పురుగులమందు సేవించాడు. ఈ ఘటన చూసిన మేనేజర్ బ్యాంకు నుంచి నిర్లక్ష్యంగా బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకులో పడిపోయిన కోదండ ను స్థానికులు కొందరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కోదండ ప్రాణాలు కోల్పోయాడు. తన మృతికి బ్యాంక్ మేనేజర్ ఒత్తిళ్లే కారణమని కోదండ సూసైడ్ నోట్ రాశాడు. కోదండకు తల్లి నారాయణమ్మతో పాటు ఓ సోదరుడు, ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి వివాహం అయింది. చివరి చెల్లి శ్రీదేవికి వివాహం కాలేదు.

 

ఆందోళనకు దిగిన ప్రతిపక్షపార్టీలు


యువరైతు ఆత్మహత్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యకు కారణమైన బ్యాంక్ మేనేజర్‌ను అరెస్టు చేయాలని ఉరవకొండలో అనంతపురం-బళ్లారి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తర్వాత రైతు మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లి, సిండికేట్ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. చనిపోయిన కోదండ కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోదండతో పాటు పలువురు ఇతర రైతులను కూడా మేనేజర్ ఒత్తిళ్లకు గురిచేశారని ధర్నాలో పాల్గొన్న రైతులు ఆరోపించారు.   



విచారణకు ఆదేశించాం

యువ రైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యకు పాల్పలడడం విషాదకరం. జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథంతో ఆలోచించి... రైతు పేరుపై ఉన్న రుణాన్ని మాఫీ చేసేలా సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.  ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం. బ్యాంకు సిబ్బంది కారణమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- కోన శశిధర్, జిల్లా కలెక్టర్



పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు

తల్లిపేరుతో ఉన్న అప్పును కోదండ పూర్తిగా చెల్లించారు. అయితే అతని పేరుతో పాటు తన చెల్లి కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోను ఉంది. మొత్తం బకాయిలు చెల్లించేదాకా పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు. అందుకే నేను ఇవ్వలేకపోయా.

 - శివశంకర్, మేనేజర్, సిండికేట్ బ్యాంక్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top