లక్ష్యం.. ఛేదించలేకపోయారు...

లక్ష్యం.. ఛేదించలేకపోయారు...


ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేసి జనాభానియంత్రణకు తన వంతు ప్రయత్నంలో భాగంగా జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల్లో అవగాహన కల్గించివారే ఆపరేషన్లు చేయించుకునేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు కృషిచేయాల్సి ఉన్నప్పటికీ తమకు కేటాయించిన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. తమకు ఉన్న గడువులో లక్ష్యాన్ని సాధించడం అధికారులకు కష్టమే... 


►  సంక్షేమ శస్త్రచికిత్సల టార్గెట్‌ సాధించడంలో విఫలం

► 15 వేలకు కేవలం 8969మాత్రమే పూర్తిచేసిన అధికారులు


విజయనగరంఫోర్ట్‌:  కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్స లక్ష్యం సాధించడానికి నిర్ధేశిత గడువు కేవలం 10 రోజులే ఉంది. అయితే సాధించాల్సిన లక్ష్యం మాత్రం వేలల్లో ఉంది. 11 నెలల్లో సాధించలేనిది కేవలం 10 రోజుల్లో సాధిస్తారనేది సందేహంగా నిలిచింది. 2016–17 సంవత్సరానికి వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమ లక్ష్యం 15వేలు ఇచ్చింది. అయితే ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 8969 చికిత్సలు చేశారు.


ఇంకా 6031 కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా కేవలం 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో లక్ష్యాన్ని సాధించడం అంత సులవు కాదు. జనాభా నియంత్రణకు అతి ప్రధానమైన కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని నెరవేర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి నెలా నిర్వహించే సమావేశాల్లో కుటుంబ సంక్షేమ చికిత్సల లక్ష్యాన్ని సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. కాని అది అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో జిల్లా వెనుకపడడమే ఇందుకు నిదర్శనం. జిల్లా జనాభా ఏటా పెరుగుతోంది.


ఈ నేపథ్యంలో జనాభాను నియంత్రించడం చాలా అవసరం. కానీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. జనాభాను అరికట్టకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా స్థల సమస్య, నిరుద్యోగసమస్య, ఆహార సమస్య ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారమే కు.ని. చికిత్స.


వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం..

కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సల లక్ష్యాన్ని సాధించడానికి కృషిచేస్తున్నాం. సాధ్యమైనంత తొందరగా వీటిని పూర్తి చేస్తాం. ఈ నెలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.

                                                                              డాక్టర్‌ సి.పద్మజ, డీఎంహెచ్‌ఓ, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top