పోలీసుల వేధింపులు: కుటుంబం ఆత్మహత్యాయత్నం


మచిలీపట్నం : పోలీసుల వేధింపులు తాళలేక ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలసి మున్సిపల్ కార్యాలయం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో తనవెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను పోసుకుని నిప్పంటించికునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడికి చేరుకున్న మీడియా సిబంది ఆమెను వారించి ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు.


ఈ సంఘటన కృష్ణాజిల్లా గుడివాడలో గురువారం చోటు చేసుకుంది. కెల్లా నాగమణి (35), అశోక్ దంపతులు గుడివాడలో నివసిస్తున్నారు. వీరికి దుర్గాశాంత, హేమలత, హేమేంద్ర ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ఆమె భర్త అశోక్ వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో నాగమణి దంపతులు ఘర్షణ పడ్డారు. ఈ నేపధ్యంలో వారి పంచాయతీ పోలీస్స్టేషన్‌ దాకా వెళ్లాంది.



అయితే నాలుగు రోజుల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయి బంధువుకి చెందిన ద్విచక్రవాహనాన్ని అశోక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. దీంతో బైక్ యజమాని పోలీసులను ఆశ్రయించి ఫలానా వ్యక్తి తన వాహనాన్ని చోరీ చేసి ఇంట్లో పెట్టుకున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు అశోక్‌తోపాటు నాగమణిని కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారు.


తమ కోరిక తీరిస్తే కేసు లేకుండా చేస్తామని ఐడీ పార్టీకి చెందిన ఒక పోలీసు నాగమణికి తరచు ఫోన్‌ చేసి వేధించేవాడు. దాంతో విసిగిపోయిన నాగమణి గురువారం ఉదయం ముగ్గురు పిల్లలను తీసుకుని మున్సిపల్ కార్యాలయ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు నాగమణి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థాలనికి చేరుకుని నాగమణితో పాటు పిల్లలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు తనను వేధించారని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని నాగమణి మీడియా ముందు మొరపెట్టుకుంది. ఈ విషయమై పోలీసులు నోరుమెదపడంలేదు. ఈ సంఘటన జరిగినపుడు నాగమణి భర్త అశోక్ ఊరిలో లేడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top