‘నకిలీ’ కలకలం

‘నకిలీ’ కలకలం - Sakshi


కైకలూరు : కొల్లేరు తీరంలో నకిలీ కరెన్సీ నోట్లు లభించడంతో కలకలం రేగింది. దొంగనోట్లు చెలామణి చేసే ముఠాలో ఈ ప్రాంతవాసులు కూడా ఉన్నట్లు తెలియడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కలిదిండిలోని ఓ ఇంటి వెనుక తవ్వి దాచిన రూ.4.50లక్షల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపలు, రొయ్యిల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. దీంతో ఈ ప్రాంతం తమకు అనుకూలమని భావించిన నకిలీ కరెన్సీ ముఠా జోరుగా దొంగనోట్లను చెలామణి చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే కొందరిని కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారు.

 

బంగ్లాదేశ్‌లో తయారీ..

 

బంగ్లాదేశ్‌లో తయారుచేసిన నకిలీ కరెన్సీని విజయనగరం నుంచి రాజమండ్రి మీదుగా కొల్లేరు ప్రాంతానికి తరలిస్తున్నారు. అసలు నోట్లు రూ.25వేలు ఇస్తే నకలీ నోట్లు లక్షన్నర వరకు అందజేస్తారని సమాచారం. కలిదిండిలోనే నకిలీ నోట్లు తయారుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుడి బంధువుల ఇంట్లో ప్రింటర్ లభించడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇటీవల కాలంలో కైకలూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు ఇచ్చిన రూ.500, రూ.100 నోట్లు నకిలీవని రైల్వేపోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రెఫర్ చేశారు.

 

లబోదిబోమంటున్న వ్యాపారులు..

 

నకిలీ నోట్ల కారణంగా వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కైకలూరులోని ఓ హోటల్‌కు వచ్చిన నిత్యావసర వస్తువులను విక్రయించే వ్యక్తి రూ.500 నోటు ఇచ్చాడు. హోటల్ వ్యాపారి తిరిగి చిల్లర అతనికి ఇచ్చాడు. మరుసటి రోజు ఆ నోటును కరెంటు బిల్లు కట్టడానికి వెళితే అక్కడ అధికారులు దొంగ నోటుగా గుర్తిం చారు. ఇటువంటి ఘనలు పదేపదే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు డబ్బులు చెల్లించే క్రమంలోనూ అధికారులు నకిలీ నోట్లు గుర్తించి చింపివేస్తున్నారు. నకిలీ నోట్లు తెచ్చిన వ్యక్తులు కేసు పెట్టేందుకు వెనుకాడుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top