నకిలీ నోట్లు చెలామణి చేసే ముఠా అరెస్ట్


కర్నూలు : లక్షకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మోసగిస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కర్నూలు ధర్మపేటకు చెందిన షేక్ సలీం, కుమార్, ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం బెస్తవీధికి చెందిన కృపాకర్ ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు చెలామణి చేసేవారు. వీరు కర్నూలుకు చెందిన రఘుబాబుకు లక్షకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు. అత్యాశకు పోయిన రఘుబాబు నెల రోజుల క్రితం ఐదు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. రూ.25 లక్షలు బ్యాగులో ఉన్నాయని రఘుబాబుకు ఇచ్చారు. పైన కొన్ని నోట్లు పెట్టి లోపల తెల్లకాగితాలు పెట్టారు.



కాగా ఆ నోట్లను రఘుబాబు లెక్కపెట్టుకుండగా నకిలీ నోట్ల చెలామణి ముఠాకు చెందిన నకిలీ పోలీసులు రావడంతో రఘుబాబు నోట్ల కట్టల బ్యాగు అక్కడే వదిలేసి పారిపోయాడు. రఘుబాబు నుంచి ముందే ఐదు లక్షలు తీసుకున్న ముఠా బ్యాగుతో అక్కడి నుంచి ఉడాయించింది. తాను మోసపోయానని, వచ్చింది నకిలీ పోలీసులని గ్రహించిన రఘుబాబు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం షేక్ సలీం, కుమార్, కృపాకర్‌లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top