ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం - Sakshi


* సినీఫక్కీలో విరుచుకుపడ్డ దుండగులు

* గార్డు నోరు, చేతులకు ప్లాస్టర్ అతికించిన వైనం


కాకినాడ క్రైం : కాకినాడలో ముగ్గురు దుండగులు శనివారం అర్ధరాత్రి పేట్రేగిపోయారు. సినీఫక్కీలో ఏటీఎంలోకి చొరబడి సెక్యూరిటీ గార్డు నోటికి ప్లాస్టర్ అంటించి, అదే ప్లాస్టర్‌తో అతడి చేతులు కట్టేసి ఏటీఎం లోపల గదిలో బంధించారు. ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం లాకరు తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. సెక్యూరిటీ గార్డు, పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. పెదపూడి మండలం జి. మామిడాడకు చెందిన ద్వారంపూడి భాస్కరరెడ్డి ఓరియన్ సెక్యూర్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.



శనివారం రాత్రి అతడిని సంస్థ ప్రతి నిధులు కాకినాడ సూర్యారావుపేటలోని రామాలయం వీధిలో రాఘవేంద్రస్వామి కోవెల సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా నియమించారు. అతడు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి ఏటీఎం వద్దకు వచ్చారు. ఇద్దరు దుండగులు వారి వద్ద ఉన్న గన్‌లతో గార్డు భాస్కరరెడ్డిని బెదిరించారు. మరో దుండగుడు అతడి నోటికి ప్లాస్టర్ అతికించాడు. అనంతరం అతడి చేతులను కట్టి ఏటీఎంలోని రూమ్‌లోకి తీసుకువెళ్లి బంధించారు. వారి వెంట తెచ్చుకున్న గునపంతో ఏటీఎంను బద్దలుగొట్టారు. లాకరు బద్దలుకాకపోవడంతో సుమారు గంటపాటు శ్రమించారు.



సెక్యూరిటీ గార్డు తప్పించుకునే వీలులేకుండా అక్కడే ఉండి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎంతకీ సీక్రెట్ లాకరు తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి బైకుపై పరారయ్యారు. సుమారు మూడు గంటల సమయంలో బీట్ కానిస్టేబుళ్లు అటుగా వెళ్తుండడాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు భాస్కర రెడ్డి కట్లు తెంచుకుని బిగ్గరగా అరిచాడు. అక్కడికి చేరుకున్న కానిస్టేబుళ్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయాన్ని టూ టౌన్ క్రైం పోలీసులకు తెలిపారు. క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దీనిపై టూ టౌన్ క్రైం ఎస్సై అలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

వీకేరాయపురం చోరీ వారిపనేనా..?

ఇదిలావుండగా శనివారం రాత్రి సామర్లకోట మండలం వీకే రాయపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.రెండు లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే ఆ సంఘటన కూడా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరగడంతో కాకినాడలోని ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసిన దుండగులే వీకే రాయపురం ఆలయంలో చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన

 ముఠా పనిగా భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top