ఆత్మహత్యాయత్నం వెనుక... యూనియన్ల వర్గపోరు


 విజయవాడ :  రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్న మొండెం రాధ ఈనెల 3న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘన వెనుక యూనియన్ల వర్గపోరు ఉన్నట్లు తేటతెల్లమైంది. గత నెల 21న రైల్వే ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎంప్లాయిస్ సంఘ్ విజయం సాధించింది. మజ్దూర్ యూనియన్ ఓటమిపాలైంది. ఎంప్లాయిస్ సంఘ్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుండగా మజ్దూర్ యూనియన్‌ను వామపక్ష పార్టీలు బలపరుస్తున్నాయి. అయితే వారు ప్రత్యక్షంగా ఎక్కడా పాల్గొనలేదు.



రజనీకుమారిపై ఆరోపణలు

ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఎ. రజనీకుమారి తనను వేధిస్తున్నారని 20 రోజుల క్రితం మహిళా విభాగం హెడ్‌నర్స్ ఎం రాధ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆయన సరిగా పట్టించుకోలేదు. దీంతో హెడ్‌నర్స్ రజనీకుమారి వేధింపుల వ్యవహారాన్ని భర్త రాజశేఖర్‌కు రాధ తెలిపింది. దీంతో రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి హెడ్‌నర్స్‌ను నిలదీశాడు. తన సెల్‌ఫోన్ విరగొట్టి తనపై దాడి చేసినట్లు రజనీకుమారి రాజశేఖర్‌పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో కేసుపెట్టింది.  తన భర్తపై పెట్టిన కేసు విరమించుకోవాలని రజనీకుమారిని రాధ కోరింది. అందుకు నిరాకరించిన రజనీకుమారి, రాధను మరింత అవమానించింది. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు కారణం రజనీకుమారేనని చెప్పింది. ఈ మేరకు రాజశేఖర్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో రజనీకుమారిపై కేసు పెట్టాడు.



ఓటమిని జీర్ణించుకోలేకే...

రజనీకుమారి ఆస్పత్రి విభాగం నుంచి యూనియన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా ఎంప్లాయీస్ సంఘ్ తరఫున పోటీ చేయగా, మజ్దూర్ సంఘ్ సభ్యుడు తిరుపతి స్వామి గెలుపొందాడు. ఓటమిని తట్టుకోలేక తనను వేధించడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.



ఆస్పత్రిలో వర్గపోరే ఎక్కువ

ఆస్పత్రిలో రెగ్యులర్ సిబ్బంది 25 మంది ఉన్నారు. వీరు కాకుండా మెడికల్ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు వస్తుంటారు. రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు బాగా అందించే అవకాశం ఉంది. అయితే రిటైర్డ్ ఉద్యోగులు వచ్చినప్పుడు వారిని విసుక్కోవడం, సరిగా వైద్యం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యూనియన్‌ల మధ్య ఉండే స్పర్థలను మనసుల్లో పెట్టుకొని వర్గాలుగా విడిపోయి వైద్యం  సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెలైన్ పెట్టేందుకు సఫాయి కార్మికులను వాడుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంత మంది నర్సులు ఉండి కూడా ఈ దుస్థితి ఎందుకు వచ్చిందనేది ఉన్నతాధికారులు పరిశీలించాల్సి ఉంది.



మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు

ఆస్పత్రికి రైల్వే శాఖ ద్వారా సరఫరా అయ్యే మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాధ మందులు వైద్యశాల నుంచి తీసుకుపోయి అమ్ముకుంటున్నదని, అందుకే మందలించానని రజనీకుమారి చెబుతోంది. ఇందులో నిజమెంతనేది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది.



 మందులు దొంగతనంగా బయటకు తీసుకువెళ్లి అమ్ముకుంటుంటే హెడ్‌నర్స్‌గా రజనీ కుమారి కాని, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎన్‌సీ రావుకాని ఎందుకు చర్యలు తీసుకోలేదనేదీ ప్రస్తుతం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో జరుగుతున్న కీచులాటలు ఆత్మహత్యా యత్నం వరకు వెళ్లాయంటే ఎటువంటి పరిణామాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top