ఆతిథ్యం..అట్టహాసం


అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు  

వీఐపీల కోసం స్టార్ హోటళ్లు సిద్ధం

అమరావతి రాజధాని భూమి పూజపై కసరత్తు


 

విజయవాడ : మరో రెండు వారాల్లో జరిగే అమరావతి రాజధాని భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు వ్యూహం రచించింది. కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులు, స్టార్ హోటళ్ల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రాథమికంగా ప్రణాళిక రూపొందించారు. దేశ విదేశాల నుంచి సుమారు 1500 మంది అతిథులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రధానంగా విజయవాడలో మకాం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించారు.



రెండు వేల గదుల్లో వసతి

అతిథుల కోసం స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో రెండు వేల గదులు అవసరమవుతాయని అధికారులు అంచనాకు వచ్చారు. నగరంలో ఫోర్‌స్టార్, త్రీస్టార్‌తో పాటు ద్వితీయ శ్రేణిలో ఉన్న 10 హోటళ్ల        యజమానులు సమావేశానికి హాజరై తాము 700 గదులు ఏర్పాటుచేయగలమని చెప్పారు. మరొకొన్ని ద్వితీయశ్రేణి హోటళ్ల గదులు కూడా సేకరించాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆహ్వాన పత్రికలు ముద్రిస్తున్నారు.



ప్రొటోకాల్ బాధ్యతలు

ఆహ్వానాలు పంపిన అతిథులు విమానాలతోపాటు రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో రోడ్డు మార్గంలో వచ్చే అవకాశం ఉన్నందున ఆహ్వాన పత్రంలో రూటు మ్యాప్‌తోపాటు అక్రిడేషన్ కార్డు జతపరుస్తారు. అతిథులకు పంపే ఆహ్వాన పత్రంలో ప్రొటోకాల్ నిర్వహించే అధికారి ఫోన్ నంబర్ కూడా నమోదుచేస్తారు. విజయవాడ బస్‌స్టాండ్‌కు సబ్‌కలెక్టర్, రైల్వేస్టేషన్‌కు విజయవాడ మునిసిపల్ కమిషనర్, గన్నవరం విమానాశ్రయంలో నూజివీడు ఆర్డీవోకు అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్ అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ ఏర్పాట్లన్నింటిపై సీఆర్‌డీఏ, కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు.  సమావేశంలో ప్రొటోకాల్ ఉన్నత స్థాయి అధికారి సత్యనారాయణశర్మ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విజయవాడ సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top