ఎక్సైజ్ దోపిడీ!


సాక్షి, గుంటూరు :  జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అందిన కాడికి దోచేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి మద్యం సిండికేట్లతో కుమ్మక్కై వాటాలు అందుకుంటున్నారని వినిపిస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని, ఎక్కడా బెల్టుషాపులు ఉండకూడదనే నిబంధనలు జిల్లాలో అమలవుతున్నట్టు కనిపించడం లేదు.

 

 జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలకు ప్రస్తుతం 313 షాపులు నడుస్తున్నాయి. గుంటూరులోని మద్యం దుకాణదారులు క్వార్టర్ బాటిల్ ధరపై పది రూపాయల వరకు అధిక ంగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25 నుంచి రూ. 30 వరకు అధికంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కొత్త మద్యం విధానం ద్వారా దుకాణాలు కేటాయించిన ప్రభుత్వం ఎమ్మార్పీకి విక్రయాలు జరపాలని నిబంధన పెట్టినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీని కాదని అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనికి ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 ఒకవేళ ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని ఎక్కడైనా మందుబాబులు  హడావుడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండులను పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని కొత్తరకం బ్రాండ్లను బయటకు తీసి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు అలవాటు పడిన బ్రాండ్ మద్యం మాత్రమే తాగుతారని తెలిసిన వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం వసూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.

 

 కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వద్ద బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మగా వచ్చే లాభాల్లో తమకూ వాటా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. తమపై అధికారులకు నెలవారీ పంపాలంటూ మద్యం దుకాణాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 గ్రామాల్లో బెల్టు షాపులు ...

 టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తూ చేసిన సంత కానికి విలువ లేకుండాపోయింది. నేటికీ అనేక గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ షాపులను తొలగించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు.  అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు ఉండడంతో అధికారులు వాటి జోలి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు.

 

 అర్ధరాత్రి వరకు అమ్మకాలు...

 మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల అనంతరం షట్టర్లకు తాళాలు వేసి దొడ్డి గుమ్మం నుంచి విక్రయాలు జరుపుతున్నారు. ఏ సమయంలో అమ్మితే మాకేంటి అనుకున్నారేమోగానీ ఎక్సైజ్ అధికారులు ఫోన్‌లు పక్కన పడేసి హాయిగా నిద్దరోతున్నారు. కొందరు పోలీసులు సైతం నెలవారీ సొమ్ములకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రి వేళ నిబంధనలతో పనిలేకుండా మద్యం విక్రయాలు జరుపుకునేందుకు వ్యాపారులు పోలీసు శాఖలో జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top