నగదు దోపిడీకి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ యత్నం

నగదు దోపిడీకి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ యత్నం - Sakshi


గిద్దలూరు రైల్వేస్టేషన్‌లో ఇద్దరితో కలిసి వ్యాపారిపై దాడి

ముగ్గురిపై కేసు నమోదు చేసిన నంద్యాల జీఆర్‌పీ పోలీసులు




గిద్దలూరు : ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లమంటూ ముగ్గురు యువకులు ఓ కూరగాయల వ్యాపారిని బెదిరించి దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన స్థానిక రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై శనివారం రాత్రి జరిగింది. ఎక్సైజ్‌ కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మండలంలోని పొదలకుంటపల్లెకు చెందిన ఖాశిం కూరగాయల వ్యాపారి.



అనంతపురంలో టమోటా రైతులకు నగదు ఇచ్చేందుకు రూ.3 లక్షలతో ఇంటి నుంచి బయల్దేరి స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అక్కడ ఆయన అనంతపురం వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి ఉంది. రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉండటంతో ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఖాశిం పడుకున్నాడు. పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ బి.రంగస్వామి తొలుత ఖాశిం వద్దకు వెళ్లి ప్లాట్‌ఫాంపై ఎందుకు పడుకున్నావురా.. అంటూ నిద్ర లేపాడు. రైలు కోసం ఉన్నానని చెప్పినా వినిపించుకోకుండా నీ సంచిలో నల్ల కవర్లలో గంజాయి ఉన్నట్లు సమాచారం వచ్చింది.. చూపించురా..అంటూ దురుసుగా మాట్లాడాడు.



ఖాశిం తీవ్ర ఆగ్రహంతో నీకేం సంబంధం.. అంటూ నిలదీశాడు. ఇంతలో మురళి అనే వ్యక్తి వచ్చి ఇద్దరూ కలిసి ఖాశింను కొట్టారు. ఆ తర్వాత ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మద్దిరాల వెంకటేశ్వర్లు అక్కడకు వచ్చి ఇంతసేపు ఏంటిరా నీతో మాట్లాడేదంటూ ముగ్గురూ కలిసి దాడి చేశారు. తప్పించుకున్న ఖాశిం.. నేరుగా వెళ్లి ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్, అతని ఇద్దరు స్నేహితులను పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా బీట్‌ డ్యూటీలో ఉన్న కొమరోలు ఎస్‌ఐ తన సిబ్బందితో వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు.



ఆదివార ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్థానిక ఎస్‌ఐ కొమర మల్లికార్జున.. రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటనపై తమకు సంబంధం లేదంటూ ముగ్గురునీ వదిలేశారు. నంద్యాలకు వెళ్లి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ బాధితుడికి ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు. బాధితుడు నంద్యాల వెళ్లి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ విభాగం ఎస్‌ఐ నారాయణయాదవ్‌ తెలిపారు. ఖాశాన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.



ఏడాదిగా గంజాయి ఊసేలేదు..

ఎక్సైజ్‌ పోలీసులు ఏడాది నుంచి ఒక్క గంజాయి కేసు కూడా నమోదు చేయలేదు. ఇటీవల పోలీసులు రెండు పర్యాయాలు, రైల్వే పోలీసులు ఒక పర్యాయం గంజాయి పట్టుకుని నిందితులను అరెస్టు చేశారు. గంజాయి ఉందంటూ పట్టణంలో వ్యాపారులపై దాడికి దిగి వారిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎక్సైజ్‌ పోలీసులపై పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. వారం క్రితం రాచర్ల మండలం అనుములపల్లెలో బెల్ట్‌ దుకాణంపై దాడి చేసిన ఎక్సైజ్‌ పోలీసులు నిర్వాహకుల వద్ద రూ.20 వేలు వసూలు చేసినట్లు సమాచారం. మద్యం బాటిళ్లు మీరు తీసుకురాకుండా, తాగే వారినే ఒక్కొక్కటిగా తెచ్చుకుని తాగమని చెప్పుకోండంటూ బెల్ట్‌షాపుల నిర్వాహకులకు సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top