నాకూ ఒకటి


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవకాశం లేకపోయినా తాను చెప్పింది చేయాలని జిల్లా మంత్రి అబ్కారీశాఖ సిబ్బందిపై పెత్తనం చెలాయించడం చర్చనీయాంశమైంది. తన మాట చెల్లుబాటుకోసం అవసరమైతే నిబంధనలు సడలించాలని కూడా ఆదేశించడంపై వారంతా విస్తుపోతున్నారు. అంతేగాకుండా కలెక్టర్‌కూ స్వయంగా ఫోన్ చేసి తన కోటా కింద ఓ మద్యం దుకాణం వచ్చేలా చూడండంటూ ఆదేశించడం మంత్రి వైఖరికి అద్దం పడుతోంది. జిల్లాలో జనాభా ప్రాతిపదికన 232మద్యం దుకాణాలేర్పాటయ్యాయి. ఈ ఏడాది కొత్త పాలసీలో భాగంగా 232దుకాణాల్లో 10శాతం అంటే 23దుకాణాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. దీనికోసం నెల రోజుల నుంచి అబ్కారీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేపట్టారు.

 

 దుకాణాల వద్ద నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడం, భారీ అమ్మకాలు జరుగుతుండడం వంటి అంశాల ఆధారం గా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలేర్పాటు చేయాలో అధికారులు వివరాలు సేకరించి హైదరాబాద్‌కు పంపారు. క్లస్టర్ ఆఫ్ షాప్స్ అంటూ మరో నిబంధనపైనా దృష్టిసారించారు. తాజా మద్యా న్ని విక్రయించడం, పక్కాగా ఎమ్మార్పీ అమలు చేయ డం, కల్తీ మద్యానికి తావు లేకుండా చూడడం వంటివి ప్రభుత్వ మద్యం దుకాణాల ప్రత్యేకతలు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో వచ్చే లెసైన్సు ఫీజును కూడా ప్రభుత్వం వదులుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 23దుకాణాలేర్పాటుకు అధికారులు నిర్ణయించారు.

 

 ఒక్కటే కదా... చూడండి!

 జిల్లాలోని శ్రీకాకుళం మునిసిపాలిటీ పరిధిలో 30వ వార్డులో ఒకటి, గార, కల్లేపల్లి, చిలకపాలెం, ఆమదాలవలస 8వ వార్డు, పైడిభీమవరం, పొందూరు, నరసన్నపేటలోని 19వ వార్డు, పోలాకి, పాలకొండ, వీరఘట్టం, రాజాం, ఉంగరాడమెట్ట, పాతపట్నం, కొత్తూ రు, టెక్కలిలోని 5వ వార్డు, నందిగాం, కోట బొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, బారువ, ఇచ్చాపురం ప్రాంతాల్లో ఒక్కోటి చొప్పున ప్రభుత్వ మద్యం దుకాణాలేర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో జిల్లా మంత్రి నియోజకవర్గం పరిధిలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి ప్రాంతాల్లో మూడు దుకాణాలు రానున్నాయి. అయి నా మరొకటి ఏర్పాటయ్యేలా చూడండంటూ అధికారులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఈవిషయమై కలెక్టర్‌ను డిమాండ్ చేస్తుండటం విస్మయపరుస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top