అంతా గందరగోళం


ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలను ఆయా బ్యాంకులకు విడుదల చేస్తూ, రుణమాఫీకి వివిధ ఆంక్షలను పెట్టింది. రైతులకు రెండు, ఆపై బ్యాంకుల్లో రుణాలున్నా ఒకే బ్యాంకులో మాత్రమే రుణమాఫీకి అవకాశం కల్పించింది. భార్యాభర్తల పేరిట వేర్వేరుగా రుణాలున్నా 20 శాతమే మాఫీకి వర్తింపచేస్తూ, రుణమాఫీలో గందరగోళం సృష్టించింది.

చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో మొత్తం 8,70,321 మంది రైతులు 2013 డిసెంబర్ 31 నాటికి రూ.11,180.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు.



అందులో రుణమాఫీకి అర్హులుగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖా తా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి బ్యాం కర్లు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో కూడా మొదటి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 1,42,229 మందికి మొత్తం 4,48,773 మంది రైతులను మాత్రమే రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. మిగిలిన 4,31,548 మంది రైతులకు రుణమాఫీకి అనర్హులంటూ మొండిచేయి చూపింది. దీంతో రూ. 11,180.25 కోట్ల రుణాలకుగాను రూ. 600 కోట్ల మేరకు మాత్రమే రుణమాఫీ కానున్నట్లు బ్యాంకర్లు లెక్కల్లో తెలియజేశారు.



అందులో మొదటి విడత జాబితాలోని రైతులకు రూ.470 కోట్ల మేరకు మాత్రమే రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం బ్యాంకులకు నిధులను కేటాయించింది. అయితే రుణమాఫీ జాప్యం కారణంగా జిల్లా రైతులపై రూ.939 కోట్ల మే రకు  అపరాధ వడ్డీభారం పడింది. దీంతో అపరాధ వడ్డీ మే రకు కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడ త జాబితాలోని 1,42,229 మంది రైతులకు రుణమాఫీని ప్ర భుత్వం  రెండు నెలల ఆలస్యంగా ప్రకటించింది. దీనికారణం గా రెండో జాబితా రైతులకు అపరాధ వడ్డీ భారం మరింత పెరగడంతో రైతులు  ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

 

ఒక్క బ్యాంకులోనే మాఫీకి అవకాశం

ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ జాబితాలను ఆయా బ్యాంకులకు పంపుతూ, రుణమాఫీలో మరో మెలిక పెట్టింది. ఒకే రైతు రెండు, మూడు ఆపై బ్యాంకుల్లో రుణాలు పొంది ఉంటే ఒకే బ్యాంకులోనే రుణమాఫీకి అర్హతను పెట్టింది. రుణమాఫీ నిధులు అకౌంట్లకు జమచేసిన వెంటనే బ్యాంకర్లు అర్హుల పట్టాదారు పాసుపుస్తకాల్లో ‘డెబిట్ వీవర్స్’గా చూపెడుతూ స్టాంపును వేసి సంతకం చేస్తున్నారు. దీంతో అదే పాసుబుక్‌ను మరో బ్యాంకులో చూపెట్టడం వల్ల ఆ బ్యాంకు వారు స్టాంపు వేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో మరో మారు స్టాంపు వేయడం కుదరదని తెలియజేస్తున్నారు. దీంతో ఒక రైతు మాఫీ అయిన రుణాల మొత్తాలకు గాను ఒకే బ్యాంకులో మాత్రమే అర్హతను పొందగలుగుతున్నాడు.

 

ఒక ఖాతాకు మాత్రమే20 శాతం మాఫీ

రైతులకు రూ. 50 వేలలోపు రుణం ఉంటే ఒకే దఫాలో పూర్తిగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భార్యాభర్తలకు రెండు ఖాతాలకుగాను, ఒక్కో ఖాతా కింద రూ.25 వేల మేరకు విడివిడిగా రుణాలు పొందివున్నా, ఇద్దరికి కలిపి మొత్తం రుణంలో రూ. 50 వేలకన్నా తక్కువగా ఉన్నా ఇద్దరికి కలిపి 20 శాతం మేరకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. దీంతో రైతుల్లో రుణమాఫీపై గందరగోళం నెలకొంది.

 

జిల్లాలోని మొత్తం 1,42,229 మంది రైతులు రెండో జాబితాలో రుణమాఫీకి అర్హులుగా ఉన్నారు. కానీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో జాబితా మేరకు రుణాలు మాఫీ జరిగేట్లు లేదని పలువురు బ్యాంకర్లు తెలుపుతున్నారు.

 

ఎంత మందికి మాఫీ అన్నది తెలియదు

రెండో విడత ఎంతమంది రైతులకు రుణమాఫీ వర్తించిందన్న విషయం తెలియదు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆయా బ్యాంకులకు మాత్రమే రుణమాఫీ జాబితాలను విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులకు, ఎంతమేరకు రుణమాఫీ అనే విషయాలకు సంబంధించి జాబితాలు రావాల్సి ఉంది.

 -వెంకటేశ్వరరెడ్డి, లీడ్ జిల్లా మేనేజర్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top