అందరి చూపు చిత్తూరు వైపు


సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో  రాష్ట్రంలోనే అత్యధికంగా 1606  ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుండడంతో ఇతర జిల్లాలకు చెందిన బీఈడీ, డీఈడీ అభ్యర్థుల చూపు ఈ జిల్లా పై పడింది. నాన్‌లోకల్ వారికి 20శాతం రిజర్వేషన్ ఉం డడంతో బయట జిల్లాల అభ్యర్థులు చిత్తూరు జిల్లాలో డీఎస్సీ రాసేందుకు మొగ్గు చూపుతున్నారు.



ముఖ్యంగా తక్కువ పోస్టులు ఉన్న వైఎస్సార్, విజయనగరం, కృష్ణాతోపాటు పలు  జిల్లాలకు చెందిన  అభ్యర్థులు  చిత్తూరులో డీఎస్సీ రాసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారం చేపట్టిన ఆరు నెలల తరువాత ఎట్టకేలకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 19న మంత్రి గంటాశ్రీనివాసరావు డీఎస్సీ నిర్వహణపై ప్రకటన చేయగా, 20న అధికారికంగా నోటిఫికేషన్ వెలువరించారు.   



రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులోనే అత్యధికంగా 1606 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. చిత్తూరు తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే వెయ్యి పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులున్నాయి. రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లాలో అతి తక్కువ పోస్టులు(356) మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో చూపారు. ఆ తరువాత వరుస క్రమంలో  విజయనగరం జిల్లాలో 362, కృష్ణాలో 379, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు 416, పశ్చిమ గోదావరి 601, శ్రీకాకుళం 719, కర్నూలు731 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ  వేలసంఖ్యలోనే ఉపాధ్యాయ పోస్టులు  ఖాళీగా ఉన్నాయి.



ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ పేరుతో పోస్టులు కుదించి మొక్కుబడిగా ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధంకావడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో  ఒక్కో జిల్లాలో 20 వేల నుంచి 40 వేలమంది వరకూ బీఈడీ,డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. చాలా జిల్లాల్లో నామమాత్రంగా మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరుగుతుండడంతో పోటీ పెరిగింది. దీంతో అధికంగా ఖాళీలు ఉన్న  జిల్లాలకు అర్హులైన అభ్యర్థులు తరలిపోనున్నారు.



చిత్తూరుకు తరలనున్న అభ్యర్థులు:

వైఎస్సార్, విజయనగరం,  కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నె ల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉండడంతో ఆ జిల్లాలకు చెందిన వారు చిత్తూరులో డీఎస్సీ రా సేందుకు ఎగబడుతున్నారు. చిత్తూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 221 ఉండగా, సెకెండరీ గ్రేడ్‌కు సంబంధించి 1,194 పోస్టులున్నాయి. లాంగ్వేజ్ పండిట్స్ 182 ఉండగా, పీఈటీలకు సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 1,606 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.



స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి బీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక సెకండరీ గ్రేడ్‌కు సంబంధించి డీఈడీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.  చిత్తూరు జిల్లాలో 30 బీఈడీ కళాశాలలు, 48 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడాదికి 15వేలకు పైచిలుకు విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. రెండు సంవత్సరాలుగా డీఎస్సీ జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల నుంచి 40వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. ఇక ఇతర జిల్లాల అభ్యర్థులు సరేసరి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top