ఎన్నికల నియమావళి పాటించాలి: కలెక్టర్‌ సుజాతశర్మ ఆదేశం


ఒంగోలు టౌన్‌: శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ సుజాతశర్మ స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో స్టాండింగ్‌ కమిటీ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో ఎన్నికల ఫిర్యాదుల విభాగం (టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంసీసీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే ప్రసారాలను సంబంధిత కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఓటర్లకు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపినా ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తోందన్నారు. మార్చి 9వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమవుతాయని, దానికి 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలు చేయరాదని పేర్కొన్నారు.



గిద్దలూరులో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు...: గిద్దలూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని వైఎస్‌ఆర్‌ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ క్రాంతికుమార్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు అధికారులను వెంటపెట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. తమ మాట వినకపోతే బదిలీ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఒంగోలులోని గుంటూరురోడ్డులో గల ఫంక్షన్‌ హాలులో మంత్రులు అధికారులను పిలిపించుకున్నారన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ మంత్రుల వెంట నిఘా బృందాలు వీడియోగ్రఫీ చేస్తున్నాయని, నిర్దిష్టమైన వివరాలతో ఫిర్యాదుచేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.



మంత్రి నారాయణ సమీక్ష నిజం కాదా?: ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో టీడీపీ కార్యాలయ ఇన్‌చార్జి దాసరి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలపై సీపీఎం నేత జీవీ కొండారెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికారపార్టీపై లేనిపోని ఆరోపణలు చేయవద్దని దాసరి వెంకటేశ్వర్లు అనడంపై కొండారెడ్డి స్పందిస్తూ మంత్రి నారాయణ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లడం, అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించడం నిజం కాదా..? అని నిలదీశారు. జేసీ హరిజవహర్‌లాల్‌ జోక్యం చేసుకుంటూ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షపై విచారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ ఏ దేవదానం, డీఆర్‌ఓ ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయాదవ్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి డొక్కా యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.



ఓటర్లపై కొండపి ఎమ్మెల్యే వత్తిడి తెస్తున్నారు...: కొండపి నియోజకవర్గ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ అక్కడి ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. చీరాలలోని భారతి కాలేజీ స్టాఫ్‌ మీటింగ్‌ పెట్టుకుని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. బా«ధ్యులకు డబ్బు చేరిన తర్వాత చెక్‌పోస్టులను అలర్ట్‌ చేశారన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top