మన్యం విలవిల

మన్యం విలవిల - Sakshi


కనిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న గిరిజనులు

లంబసింగిలో 0,

పాడేరు ఘాట్‌లో1 డిగ్రీ

చింతపల్లిలో 3,

మినుములూరులో 4 డిగ్రీలు నమోదు

ఉదయం 10 గంటల తరువాతే సూర్యోదయం


 

చింతపల్లి: కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో ఏజెన్సీ వాసులు విలవిల్లాడిపోతున్నారు. చింతపల్లి మండలం లంబసింగి, పాడేరు మండలంమినుములూరుతోపాటు మిగతా ప్రాంతాల్లోని వారు వణికించే చలితో నరకయాతన పడుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతం లంబసింగిలో సున్నా ,పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అనంతగిరి, అరకుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటాకే సూర్యుడు కనిపిస్తున్నాడు. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశం కావడంతో ఏజెన్సీలో ఈ పరిస్థితి అని, జనవరిలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో మాదిరి ఇక్కడ శీతల గాలులు వీస్తుండటం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్నారు.



2010 డిసెంబరు 19న చింతపల్లిలో అతి స్వల్పంగా 3 డిగ్రీలు నమోదుకాగా, లంబసింగిలో మైనస్ డిగ్రీలు, 2012 జనవరి 14, 15 తేదీల్లో చింతపల్లిలో ఒక డిగ్రీ, లంబసింగిలో మైనస్ 2 డిగ్రీలు నమోదయ్యాయి. మరుసటి రోజయిన 16వ తేదీన చింతపల్లిలో 2 డిగ్రీలు నమోదయ్యాయి. 2013 డిసెంబరు 13న చింతపల్లిలో అతి స్వల్పంగా 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు  నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 20న చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, 21న చింతపల్లిలో 3 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదైనట్లు శేఖర్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలు వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలి తీవ్రతతో రాత్రిళ్లు నిద్ర పట్టని దుస్థితి. నెగడులు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పగటి పూట కూడా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. కాఫీ తోటల్లో పండ్ల సేకరణకు వెళుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. దట్టమైన మంచుతో పర్యాటకులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top