ఈపీఎఫ్ పింఛన్ పెంపుతో లబ్ధి

ఈపీఎఫ్ పింఛన్ పెంపుతో లబ్ధి


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  పేదల జీవన ప్రమాణాలు పెంపే మోదీ లక్ష్యమని ఉద్ఘాటన

 

హైదరాబాద్: ఈపీఎఫ్ పరిధిలోని ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.వెయ్యి ఉండాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది లబ్ధి పొందబోతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ శాఖ పరిధిలోనే 59 వేలమంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పెన్షన్‌దారులను సన్మానించారు. పెన్షన్ పెరుగుదలకు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమానికి ఈపీఎఫ్‌వో హైదరాబాద్ రీజినల్ కమిషనర్ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ఈపీఎఫ్ అడిషనల్ సెంట్రల్ కమిషనర్ కేవీ సర్వేశ్వరన్ అతిథిగా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కొందరు నెలకు రూ.7 నుంచి రూ.30 చొప్పున పెన్షన్ పొందుతున్నారని తెలిసి ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇప్పుడు కనీస పెన్షన్‌ను రూ.వెయ్యిగా చేయడం వల్ల ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగినట్టు కాకపోయినా.. కొంతవరకు వారి పరిస్థితి మెరుగుదలకిది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకంలో వేతన సీలింగ్‌ను నెలకు రూ.15 వేలకు పెంచినందున భవిష్యత్ ఉద్యోగులు అందుకోబోయే పెన్షన్ మొత్తం రూ.7,500 వరకు పెరిగే వీలుంటుందన్నారు.



అందరికీ బ్యాంక్ అకౌంట్లు లక్ష్యం: దేశంలోని పేదల కనీస జీవన ప్రమాణాలు పెంచడం ధ్యేయంగా మోదీ పనిచేస్తున్నారని వెంకయ్య తెలిపారు. దేశంలో ఇప్పటికీ 68 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు లేవని తెలిసి ప్రధాని జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రథకం ప్రవేశపెట్టిన నెలరోజుల్లో 4.35 కోట్ల మందికి కొత్త ఖాతాలు తెరిపించారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రెడ్డి ఈపీఎఫ్ ఉద్యోగుల పెన్షన్ రూ. 6,500 పెంచాలని మంత్రికి వినపతి పత్రం అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top