నమోదు కాని తుఫాన్ మరణాలు


  •  ఏజెన్సీలో నలుగురు గిరిజనులు మృతి

  •  ఎమ్మెల్యే ఈశ్వరి చొరవతో వెలుగులోకి

  • పాడేరు :  ఏజెన్సీలో హుదూద్ తుఫాన్‌కు నలుగురు గిరిజనులు మృతి చెందినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఆయా కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. పాడేరు మండలం వంజంగి పంచాయతీ బొర్ర మామిడికి చెందిన ముదిలి చిన్నబాలన్న, దేవాపురం పంచాయతీలోని వలసమామిడిలో ఉప్పాడ సోమన్న, మాదెల రామన్న, ఎం.బాలన్నలు ఈనెల 12న పెనుగాలుల తీవ్రతకు మరణించారు. చిన్న బాలన్న పొలం పనులకు వెళ్ళి చలిగాలులకు, సోమన్నపై చెట్టు కూలడంతో మృతి చెందారు.



    రామన్న, బాలన్నలు వ్యవసాయ పనులకు వెళ్ళి తిరిగి వస్తుండగా గాలులకు మృత్యువాతపడ్డారు. మారుమూల కావడం, భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు ధ్వంసమవడంతో దేవాపురంలోని ముగ్గురు గిరిజనుల మరణాల సమాచారం రెవెన్యూ యంత్రాంగానికి తెలియలేదు. రెవెన్యూ అధికారులు కూడా ఆ ప్రాంతాల్లో సర్వేకు జాప్యం చేయడంతో తుఫాను మరణాల  జాబితాలో వీరిపేర్లు చోటు చేసుకోలేదు. చిన్నబాలన్న మృతిపై సర్పంచ్ కె.రంగమ్మ 13న సబ్ కలెక్టర్ కార్యాలయానికి సమాచారమిచ్చినా ఫలితం లేకపోయింది.



    మరణించిన ఈ నలుగురికీ ఆయా గ్రామాలలో అంత్యక్రియలు జరిపారు. మృతి చెందిన నలుగురిని తుపాను మృతుల జాబితాలో పొందుపర్చక ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం దేవాపురంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు మృతుల వివరాలను ఆమె అందజేశారు.

     

    కొండకుమ్మర్లు ఎస్టీ జాబితాలోకి..




    ఏజెన్సీలోని కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చేలా 24న జరిగే జెడ్పీ సమావేశంలో తీర్మానానికి కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. కొండకుమ్మర్ల సంఘం నేతలు అల్లంగి ప్రసాద్, ఎ.కృష్ణారావు, ఎ.సింహాద్రిలు తమ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సహకరించాలని బుధవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర, రాష్ట్ర గిరిజన మంత్రులు దీనిపై స్పందించలేదన్నారు.



    వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చే వారమన్నారు. గిరిజన సలహా మండలిలో కొండకుమ్మర్లకు న్యాయం చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పోరాడుతామని హామీ ఇచ్చారు. కొండకుమ్మర్ల భూములకు పట్టాలు లేక హుదూద్ తుఫాన్  నష్టపరిహారానికి సాంకేతిక ఇబ్బందులున్నాయని చెప్పారు. వీరు గ్రామాల వారీగా పంటలు, ఇళ్ళకు వాటిల్లిన నష్టం వివరాలను తనకు అందజేస్తే కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి పరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top