17 కుటుంబాలకు భరోసా!

17 కుటుంబాలకు భరోసా! - Sakshi


- చివరిరోజు 2 కుటుంబాలకు పరామర్శ

- ప్రతిపల్లెలోనూ జగన్‌కు హారతిపట్టిన ప్రజలు

- రైతులకు భరోసా కల్పిస్తూ... అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన యాత్ర

- ఏడో రోజు యాత్రలో రైతులు, గొర్రెల కాపరుల సమస్యలను తెలుసుకున్న జగన్

- కర్ణాటక సరిహద్దులో జగన్‌కు వీడ్కోలు పలికిన జిల్లా నేతలు

(సాక్షిప్రతినిధి, అనంతపురం):
‘అనంత’లో సాగుతున్న మూడోవిడత రైతు భరోసాయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ నెల 21నుంచి ప్రారంభమైన యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ 725 కిలోమీటర్లు పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న 17 కుటుంబాలకు భరోసా కల్పించారు. చివరిరోజు యాత్ర సోమవారం గుడిబండ నుంచి మొదలైంది. గుడిబండలోని హనుమంతరాయుని ఆలయంలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్‌ను చూసేందుకు గుడిబండలో భారీగా జనం తరలివచ్చారు.



మహిళలు హారతి పట్టారు. డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తనను చూసేందుకు వచ్చిన విద్యార్థులను జగన్ ప్రేమగా పలకరించారు. వడ్డెర్లు జగన్‌కు సమ్మెట బహూకరించారు. అక్కడి నుండి ఫలారం మీదుగా మందలపల్లి చేరుకున్నారు. ఇక్కడ మహిళలు జగన్‌కు హారతిపట్టి దిష్టి తీశారు. తర్వాత పీసీగిరి చేరుకున్నారు. అక్కడ బీడుపొలంలో దిగాలుగా కూర్చున్న గౌరమ్మ అనే మహిళరైతు పొలంలోకి వెళ్లి సాగు పరిస్థితులు ఆరా తీశారు. తర్వాత అక్కడే ఉన్న గొర్రెల కాపరులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, గొర్రెల కాపరులు నష్టపోయారని తెలుసుకున్న జగన్ చంద్రబాబు విధానాలపై పోరాడదామని భరోసా ఇచ్చారు.



తర్వాత  ఆర్. అగ్రహారం చేరుకున్నారు. ఇక్కడ జగన్‌కు మహిళలు దిష్టితీశారు. తనను చూసేందుకు వచ్చిన వృద్ధులకు ప్రేమతో తలపై ముద్దులు పెట్టారు. జగన్ కాన్వాయ్ చూసి పొలంలో కూలిపనులు చేసుకుంటున్న మహిళా రైతులు పరుగున వచ్చారు. వీరి కష్టాలను తెలుసుకున్నారు. పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, చాలామంది బెంగళూరుకు వలసలు పోతున్నారని కూలీలు చెప్పారు. వారికి జగన్ ధైర్యం చెప్పారు. తర్వాత హనుమంతనపల్లికి చేరుకున్నారు. ఇక్కడ మహిళలు హారతి పట్టి దిష్టి తీశారు. ఇక్కడ మాజీమంత్రి నర్సేగౌడ ఇంటికి జగన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. తర్వాత రోళ్లకు చేరుకున్నారు. రోళ్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.



చంద్రబాబు విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. తర్వాత జీబీహళ్లి, బాజయ్యపాళెం మీదుగా రత్నగిరి చేరుకున్నారు. లక్ష్మిదేవి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. ఇక్కడ గ్రామస్తులు జగన్‌పై పూలవర్షం కురిపించారు. తర్వాత ఉజ్జయినీపురం చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత తిరిగి రత్నగిరికి చేరుకుని అలుపనపల్లెకి వెళ్లారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుండి నేరుగా బెంగళూరు బయలుదేరి వెళ్లిపోయారు. జిల్లా నేతలు కర్ణాటక సరిహద్దు వరకూ వెళ్లి జగన్‌కు వీడ్కోలు పలికారు.

 

మూడు విడతల్లో 42 కుటుంబాలకు భరోసా:

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర పేరుతో ఇప్పటి వరకూ మూడు విడతలు జిల్లాలో పర్యటించారు. మొదటి, రెండో విడతల్లో 25 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మూడో విడతతో కలిసి మొత్తం 42 కుటుంబాలకు భరోసా ఇచ్చారు. చివరిరోజు యాత్రలో వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కాపు భారతి, నియోజకవర్గ సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, నవీన్‌నిశ్చల్, తిప్పేస్వామి, వై. వెంకట్రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, ఉషాశ్రీచరణ్, రాష్ట్ర కార్యదర్శులు బోయతిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, జిల్లానేత చవ్వారాజశేఖరరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, పార్టీ నేతలు వైసీ గోవర్దన్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top