కల్యాణమండపంపై కన్ను

కల్యాణమండపంపై  కన్ను


సత్యనారాయణపురంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి పక్కనే ఉన్న సీతారామ కల్యాణ మండపాన్ని శుక్రవారం దేవాదాయ శాఖాధికారులు స్వాధీనం చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి పత్రాలు   చూపకుండా మండపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారంటూ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డగించి పక్కకు లాగేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు దేవాదాయ అధికారులు మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెరవెనుక ఉండి ఈ తతంగమంతా నడిపారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి.

 

 

ఇది రాజకీయ నాటకం

 

సత్యనారాయణపురం : స్థానిక సీతారామ కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధికారులపై ఒత్తిడి తెచ్చారని బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపించారు.  మండపాన్ని శుక్రవారం దేవాదాయ శాఖా ధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తంతును అడ్డుకున్న బ్రాహ్మణసంఘాలు విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గానికి నడిబొడ్డులో ఉన్న ఈ మండపం కార్యాలయాన్ని దేవాదాయ శాఖ వద్ద లీజుకు తీసుకుని తన కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణమండపాన్ని తన అనుచరులకు 30ఏళ్లకు లీజుకు ఇప్పించేందుకు బొండా ఉమా ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.



 ఇది అన్యాయం : గౌతంరెడ్డి



50ఏళ్లుగా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి అన్నారు. బొండా ఉమా ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇది జరిగిందని, ఎటువంటి పత్రాలు చూపించకుండా పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు.



ఖండిస్తున్నాం.. : మల్లాది విష్ణు



పేద, మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణుల కుటుంబాలు ఈ కల్యాణ మండపంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక పోలీసుల సహకారంతో కోర్టులో ఉన్న ఈ స్థలాన్ని ఎండోమెంట్, రెవెన్యూ సిబ్బంది దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. దీనిని ఖండిస్తున్నామన్నారు.

 

బలవంతపు స్వాధీనం




దేవాదాయశాఖ స్వాధీనానికి సంబంధించిన ఎటువంటి పత్రాలను చూపలేదని భువనేశ్వరిపీఠ ధర్మాధికారి చంద్రశేఖర్ అన్నారు. ఎప్పుడో 2010 హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారని, మేము పైకి అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.



స్థలం దేవస్థానానిదే..



ఎమ్మార్వో శివరావు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 583 గజాలు దేవస్థానం కోసం వినియోగించాలని దాతలు ఈ స్థలాన్ని కొన్నారని, ఉత్సవాలు, ఇతర సమయాల్లో భోజనాల కోసం కేటాయించారని చెప్పారు. కాలక్రమేణ అక్కడ ప్రయివేటు వ్యక్తులు కల్యాణ మండపాన్ని నిర్మించారని, దీనిపైన ఆరోపణలు రావడంతో కోర్టును ఆశ్రయించామని, 40 ఏళ్లకు పైగా కోర్టులో దీనిపైనే వాదనలు జరిగాయని చెప్పారు. ఇటీవల స్థలం దేవ స్థానానికే చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనిపైన వారు కోర్టుకు వెళ్లినా డిస్మిస్ చేశారని, అందుకే స్థలాన్ని స్వాధీనం చేసుకుని దేవస్థానానికి  అప్పగిస్తున్నామని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top